అర్వింద్ విజయగర్వానికి గర్వభంగం పట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. తన వల్లే, తానే, తానే లేకపోతే ఇదంతా లేదు… నేను.. తాను… ఇదో ఇగో ఫీలింగ్‌లో బతికేశాడు. బీజేపీకి అంతా తానే అనుకున్నాడు. గెలిచిన వారిని పట్టించుకోలేదు. పాత వారిని పక్కకు కూడా రానీయలేదు. ప్రజలెవరూ కలిసే చాన్సే లేదు. కొద్ది కాలంలో విజయగర్వం తలకెక్కితే….. ఎలా ఉంటుందో దగ్గరున్న నేతలు చూశారు. దగ్గరగా చూశారు. అక్కడ ఆత్మగౌరవం చంపుకుని బతకడం వల్లకాదనుకున్నారు. అర్వింద్‌తో పొసగలేం అని డిసైడయ్యారు. బీజేపీలో ఇమడలేమని తేల్చేసుకున్నారు. అదీ హార్డ్‌కోర్ బీజేపీ నేతలు, అభిమానులు, కార్పొరేటర్లు. ఇప్పుడు వీరంతా టీఆరెస్ వైపు చూస్తున్నారు.
టీఆరెస్ కూడా చేసిన తప్పును దిద్దుకుంటోంది. అందరినీ దరి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నది. అందరికీ ప్రయార్టీ ఇస్తున్నది. పోయిన చోటే వెతుక్కునే పనిలో ఉన్నది. పూర్వ వైభవం దిశగా అన్ని ప్రయత్నాలు చేసి సఫలమవుతున్నది. తాజాగా మరో కార్పొరేటర్ టీఆరెస్‌లో చేరారు. పట్టుమని ఇకపై నలుగురు కార్పొరేటర్లు కూడా అర్వింద్ వెంట ఉండేలా లేదు. అంతలా విరక్తి చెంది ఉన్నారు అర్వింద్ ఒంటెత్తు రాజకీయాలపై. అంతా మిడిసిపాటు. గర్వపోకడ. మీతిమీరిన వ్యవహార దోరణి… అర్వింద్‌ను ఒంటరి చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ సీనియర్ నేత యెండల లక్ష్మీనారాయణ వేరు కుంపటి పెట్టి అర్వింద్ పై ఫైట్ మొదలుపెట్టాడు. తన వర్గాన్ని కాపాడుకోవడం ద్వారా బీజేపీ ఉనికిని నిలుపుదామనే తపనతో యెండల ఉన్నారు. కానీ యెండలకు పెద్దగా సపోర్టు లేదు. దీంతో అటు అర్వింద్‌తో వేగలేక… ఇటు యెండల నాయకత్వంతో తమకు రక్షణ లేదనే విషయం రూడీ చేసుకుని … టీఆరెస్ వేదికను ఎంచుకుంటున్నారు కషాయనేతలు. ఇది ఇందూరు రాజకీయాల్లో ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం.
