మునుగోడు ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల ఘట్టం ముగిసింది. పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి అన్ని పార్టీలు. ఎవరి పంథా వారిది. ఎవరి నినాదం వారిది. ఎవరి సిద్దాంతం వారిది. ప్రజానాడి పట్టడంలో పరుగు పందెంలో ఎవరు ముందో తేల్చుకునే పనిలో పడ్డాయి పార్టీలు. టీఆరెస్ ప్రచారంలో సహజంగానే ముందుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలంతా అక్కడే ఉన్నారు. ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. డోర్ టు డోర్ తిరుగుతున్నారు. సంక్షేమ పథకాలను చెబుతున్నారు. అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. ప్రజలను మెప్పించి ఒప్పించే ప్రయత్నంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు.
అయితే, ఇప్పుడు టీఆరెస్కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. కారును పోలిన గుర్తులతో తమకు నష్టం జరుగుతుందనేది గత అనుభవం నేర్పిన పాఠం. ఈసారి ఈ ఎన్నికల్లో అది జరగొద్దనేది ముందు జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. కారును పోలిన 8 గుర్తులను ఈసీ కేటాయించింది. కెమెరా, చపాతీ రోలర్, డోలీ , రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ … ఉన్నాయి. వీటిని తొలగించాలని టీఆరెస్ శ్రేణులు ఆందోళన చేసినా.. కోర్టు మెట్లెక్కినా ఫలితం లేకుండా పోయింది. మొత్తానికి ఈ గుర్తులు ఈ ఉప ఎన్నికల్లో ఉన్నాయి. దీంతో ఇప్పుడు టీఆరెస్ ప్రచారంతో పాటు కొత్త నినాదం తోడయ్యింది. ఈ కారును పోలిన గుర్తులతో కాటకల్వొద్దు… కారుకే ఓటేద్దాం.. జాగ్రత్తగా ఉందాం… అంటూ జనాన్ని గుర్తుల విషయంలో జాగృతం చేసే పనిని కూడా నెత్తికెత్తుకుంది. గతంలో జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత ముందు జాగ్రత్తతో ముందడుగు వేస్తున్నారు టీఆరెస్ నాయకులు.