కొన్ని రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కాం పేరిట నిరాధార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మోములో శుక్రవారం నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ సమయంలో ఎంతో రిలాక్స్ కనిపించింది. నిరాధార ఆరోపణలే అయినప్పటికీ ప్రజలకు బాధ్యతగా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందనే కోణంలో వ్యవహరిస్తూ వస్తున్నారు కవిత. ఈ క్రమంలో కొంత టెన్షన్ ఆమె మోములో నెలకొన్న మాట వాస్తవం. ఇలాంటి సమయంలో మహిళల మధ్య జరిగే బతుకమ్మ చీరల పంపిణీకి కవితను మంత్రి ఆహ్వానించారు.
లిక్కర్ స్కాం పేరిట టీఆరెస్ వ్యతిరేక మీడియాతో ఆరోపణలు గుప్పిస్తూ కవితను తీవ్ర ఇబ్బంది పెడుతున్న పరిస్థితులను గుర్తించి ప్రజల మధ్యకు వస్తే కవిత రిలాక్స్ అవుతారని ఆలోచించే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆమెను చీరల పంపిణీ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కార్యక్రమానికి కవిత రాగానే మహిళల నుంచి ఎప్పటిలాగే చెక్కుచెదరని ఆదరణ, ఆప్యాయత , పలకరింపు లభించింది. ఇదంతా ఒక్కసారిగా కవిత మోములో ఆనందం నింపింది. ప్రజల ప్రేమ, ఆదరణ ముందు నిరాధార ఆరోపణలు నిలవబోవనే సంకేతంగా కార్యక్రమంలో వాతవారణం కనిపించింది.
ఈ సందర్బంలో ప్రశాంత్ రెడ్డి సైతం కవితమ్మ మోములో సంతోషాన్ని చూసి ఆనందపడ్డారు. కేసీఆర్ నాయకత్వానికి, కవిత నాయకత్వానికి మొదటి నుంచి విధేయతలో అందరికన్నా ముందున్న ప్రశాంత్‌రెడ్డి మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ పట్ల తనదైన శైలిలో బాధ్యతను చాటుకున్నాడనే వ్యాఖ్యలు కార్యక్రమ సందర్భంగా వినిపించాయి.