మ‌రీ ఇంత దిగ‌జారుడు రాజ‌కీయాలు మ‌రెప్పుడూ చూసిండ‌రు బ‌హుశా..! గ‌తంలో లాగానే ఇప్పుడున్న కేంద్రం కూడా స‌బ్సిడీల పేరుతో త‌న వాటా ఇస్తూ వ‌స్తుంది రాష్ట్రాల‌కు. అందులో కొత్త‌ద‌నం లేదు. కానీ నాయ‌కులు మాత్రం త‌మ పేరు ఎక్క‌డా ప్ర‌చారం కావ‌డం లేద‌నే బెంగ ప‌ట్టుకంది. అందుకే ఎందెందులో త‌మ వాటాలున్నాయో లెక్క‌గ‌ట్టి మ‌రీ బాహాటంగానే వేదిక‌ల మీద ప్ర‌చారాల‌కు దిగింది. అదెంత వ‌ర‌కు పోయిందంటే.. మా మోడీ ఫోటో ఏదీ..? అని అడిగి మ‌రీ పెట్టించుకునేంత‌గా. మ‌రీ జుగుప్సాక‌రంగా లేదు. ఉంటే ఉండ‌నీయ్యండి .. రాజ‌కీయాలు ముఖ్యం.. బీజేపీ గెల‌వ‌డం ముఖ్యం. అధికారంలోకి రావ‌డం ముఖ్యం.. అని అంటారా..!అయితే కానియ్యండి.

ఆమె కేంద్ర మంత్రి. కామారెడ్డి జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చింది. ఎంత హుందాగా ఉండాలె. మాట్లాడితే ఓ కంటెంట్ ఉండాలె. కానీ ఆమె అచ్చం ఓ గ‌ల్లీ లీడ‌ర్‌లా వ్య‌వ‌హ‌రించింది. రేష‌న్ దుకాణాల వ‌ద్ద‌కు వెళ్లి .. కేంద్రం ఎంత భ‌రిస్తుందో.. ఎంత క‌ష్ట‌ప‌డి బియ్యాన్ని పేద‌ల‌కు చేర‌వేస్తుందో… అన్నీ వివ‌రించింది. అంద‌రూ శ్ర‌ద్ద‌గా వింటున్నారు. మ‌రి కేంద్ర‌మంత్రాయే.. ఏం మాట్లాడిన ఓ అర్థం ఉంటుంది క‌దా..! చివ‌ర‌కు ఆమె ఏమ‌న్న‌దో తెలుసా…?
మ‌రి ఇంత చేస్తున్న మ‌హాగొప్ప నాయ‌కుడైన మా మోడీ ఫోటో ఏదీ..? అన్న‌ది. అంతా ఒక‌రి ముఖాలొక‌రు చూసుకున్నారు. ఏందీ..? ఆమె ఏందీ..? ఆమె లెవ‌ల్ ఏందీ..? మోడీ ఫోటో ఏదీ..? అని అడుగుతుంది. అదో పెద్ద నేర‌మైన‌ట్టు. అస‌లు అక్క‌డ కేసీఆర్ ఫోటోలేమైనా పెట్టుకుంటున్నారా…? లేదు. ఇంకో విష‌యం పాపం ఆమె తెలియ‌దు… ఏందంటే…. ఆ చిన్న రేష‌న్ షాపు మ‌డిగిలో వ‌చ్చిన బియ్యం సంచులు నింపుకునేందుకే జాగా ఉండ‌దు… ఇక నీ ఫోటో నా ఫోటో.. ఆయ‌న ఫోటో.. గొప్ప నాయ‌కుడు ఫోటో… ఏం పెట్టుకుంటారు. వాళ్ల బాధ‌లు వాళ్ల‌వి. ఇగో వీళ్ల బాధ‌లు వీళ్ల‌వి.

మొన్నామ‌ధ్య నిజామాబాద్‌లో ఓ చోట బీజేపీ నాయ‌కులు శ్మ‌శాన వాటిక ద‌గ్గ‌ర‌కు పోలోమంటు పోయారు. ఎందుక‌బ్బా..? అనుకున్నారంతా. అక్క‌డేముంది …? అనుకుని బాగా థింక్ చేశారు. కానీ ఎవ‌రికీ త‌ట్ట‌లేదు. తీరా నాయ‌కులు మాట్లాడితే గానీ తెల్వ‌లేదు. ఏందో తెలుసా..? ఆ శ్మ‌శాన వాటిక‌ల్లో కూడా బీజేపీ నిధులు ఉన్నాయి…. మా వాటా లేనిదే ఇది నిర్మాణ‌మ‌య్యేదే కాదు.. అన్నారు. ఇంకా అంత‌టితో ఆగ‌లేదు. మ‌రి అలాంట‌ప్పుడు ఇక్క‌డ మా మోడీ ఫోటో ఎందుకు పెట్ట‌రు..? అని అడిగారు అమాయ‌కంగా… స్వాభిభ‌క్తితో… అసందర్భోచితంగా.. అల‌వాటుగా.. అజ్ఞానంగా.

ఇంకా న‌య్యం మ‌న కేంద్ర మంత్రి కూడా శ్మ‌శాన వాటిక‌ల ద‌గ్గ‌ర‌కు పోలేదు. సంతోషం.

అవునూ.. కేంద్రం ఎంతో చేస్తే .. అవి బాగా ప్ర‌చారం చేసుకోవ‌చ్చు క‌దా… చీప్‌గా … మ‌రీ ఇంత చీప్‌గా.. ఫోటోల కోసం పోరాటాలేందీ..? క‌లెక్ట‌ర్‌పై క‌స్సుమ‌న‌డమేందీ..? ఏందో..?

ఇంకో ప్ర‌శ్న‌.. దీనికి స‌మాధానం తెలిసీ చెప్ప‌లేరు బ‌హుశా…

పొయ్యి కింద‌కు ఉంటే పొయ్యి మీద‌కు లేదు.. అని ఓ పాటుంది. బియ్యం ఇస్తున్నారు స‌రే… రాష్ట్రం ఇస్తుందో , కేంద్రం ఇస్తుందో.. ఆ దొడ్డు బియ్యం ఎలాగోల తింటాం గానీ… మ‌రి కూర‌లు, వెచ్చాలు, నూనెలు…… ఇవ‌న్నీ ఎవ‌రిస్తున్నారు…? వీటి ధ‌ర‌లు ఎంత పెరిగాయి….? మ‌నుషుల జీవ‌న ప్ర‌మాణాలు ఈ పెరిగిన రేట్ల‌లో అణువంతైనా పెరిగాయా..? ఉద్యోగాలేవి..? ఉపాధి ఏదీ..? వీటి గురించి ఆలోచించేదెవ్వ‌రూ..? బియ్యం ఇచ్చినం.. మా మోడీ ఫోటో పెట్టుకోర్రి… అని అడుగుతున్న నేత‌ల్లారా.. జ‌ర వీటికి కూడా జ‌వాబియ్యండి… మీరు ఒర‌గ‌బెట్టిందేమిటి…? మీరు మంచి చేస్తే జ‌నం గుండెల్లోనే ఉంటాయి మీ ఫోటోలు.. ఇలా అడుక్కుని ప్ర‌ద‌ర్శించుకునే అవ‌స‌రం లేదు….

Dandugula Srinivas

You missed