ఇందూరు రాజకీయం వేడెక్కుతున్నది. దీనికి సీఎం కేసీఆర్ సభ ఊతం కానుంది. చాలా రోజుల తర్వాత సీఎం కేసీఆర్ నిజామాబాద్‌కు రానున్నారు. కొత్త కలెక్టరేట్, టీఆరెస్ భవన్ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం జీజీ కాలేజీలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే సీఎం సభకు రెండు రోజుల ముందే బీజేపీ సభ పెట్టుకోవాలని.. సీఎంను టార్గెట్ చేయాలని అనుకున్నది.
3న జిల్లా కలెక్టరేట్ మైదానం లేదా ఐటీఐ కాలేజీ మైదానంలో పర్మిషన్ ఇవ్వాలని కలెక్టర్‌ను కోరింది. కానీ పర్మిషన్ రాలేదు. దీంతో బీఎల్ఎన్ గార్డెన్‌లో సభ పెట్టుకుంటున్నామని, ఇందూరు జనతా కో జవాద్ దో సీఎం అనే పేరుతో ఈ సభ నిర్వహిస్తామని ఆ పార్టీ ఎంపీ అర్వింద్ ప్రెస్ మీట్‌లో ప్రకటించాడు. కానీ దీనికి పర్మిషన్ లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో ఈ సభ నిర్వహణలో భాగంగా జిల్లా కేంద్రంలో ఉ ద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి.
మరోవైపు సీఎం సభకు తనను పిలవాలని, తనకు మాట్లాడే చాన్స్ ఇవ్వాలని అర్వింద్ కోరాడు. తనను పిలిచి కూర్చోబెడితే కుదరదని, తనకు మాట్లాడే అవకాశం కచ్చితంగా ఇవ్వాలని ఆయన కోరడం కూడా కయ్యానికి కాలు దువ్వే తత్వాన్ని సూచిస్తన్నది. దీంతో సీఎం సభ ముగిసేంత వరకు జిల్లా కేంద్రంలో ఉత్కంఠ, ఉ ద్రిక్త పరిస్థితులే ఉండనున్నాయి.