ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని అర్హులుగా తేలినా..మూడేండ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆ సుధీర్ఘ నిరీక్షణకు తెరదించారు సీఎం కేసీఆర్. మొన్న పంద్రాగస్టు రోజున రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి కొత్త పింఛన్లు జారీ చేస్తూ ప్రభుత్వం నుంచి ప్రొసీడింగులను అందజేస్తున్నారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఏర్పాటుచేసి .. వారికి కొత్త పింఛన్ అమలుచేస్తున్నట్టు ఓ గుర్తింపు కార్డుతో కూడిన ప్రొసీడింగులను అందజేస్తున్నారు. దీంతో మొన్నటి వరకు ఉన్న నిరాశ స్థానంలో కొత్త ఉషారు వచ్చింది లబ్దిదారులకు.
గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమాల సందడితో సంబుర వాతావరణం నెలకొన్నది. వచ్చే నెల (సెప్టెంబర్) 3లోగా ఈ ప్రొసీడింగులు అందజేసే అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి వరకు 40 లక్షల వరకు వివిధ రకాల ఆసరా పింఛన్లు ప్రజలకు అందేవి. తాజాగా పెరిగిన వాటితో అవి 50 లక్షలకు చేరాయి. మరోనెల తర్వాత ఇంకా అర్హత ఉన్న వారికి, దరఖాస్తు చేసుకున్నా రానివారికి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
ప్రస్తుతానికి కొత్త దరఖాస్తులేవీ తీసుకోవడం లేదని, కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చనే ప్రచారం జరుగుతున్నదని, ఇదంతా అబద్దమని అధికారులు చెబుతున్నారు.