ఆ ప్రేమోన్మాది ప్రేమికురాలి గొంతును కర్కశంగా కోశాడు. బీరు సీసా పగలగొట్టి చిమ్మచీకటిలో మేక గొంతు తెంపినట్టు తెంపాడు. రక్తం చిమ్మింది. చల్లని వాతావారణంలో ఆ సైకో చేతిలో చిక్కని ఆ రక్తంతో తడిసిముద్దయిపోయాయి. ఆమె కాళ్లూ చేతులు కొట్టుకుంటున్నాయి. అలాగే పట్టుకున్నాడు కొద్దిసేపు. ఇక చచ్చిందనుకొని అక్కడ్నుంచి ఉడాయించాడు. అప్పుడు సుమారు రాత్రి 8 గంటల ప్రాంతం. జన సమ్మర్థ్యం లేదు. చుట్టూ దట్టమైన అడవిని తలపించేలా చెట్లు..పొదలు. ఆమె రక్తం ఏరులై పారుతున్నది. కళ్లు మగతగా మూసుకుంటున్నారు. మృత్యువు కళ్లముందు కనిపిస్తున్నది. కొన ఊపిరితో కొట్లాడుతున్నది. సమయం గడుస్తున్నది. రక్తం మెల్ల మెల్లగా శరీరం నుంచి ఖాళీ అవుతున్న ఫీలింగ్.. మరికొద్ది సేపట్లో చావు తప్పదని తెలిసిపోతూనే ఉన్నది. కానీ ఆమె ఊపిరి మాత్రం మొండిగా కొట్టుకుంటూనే ఉన్నది. ఎలాగైనా బ్రతకాలనే ఆమె ఆశ.. ఆ ఊపిరికి ఊపిరి పోస్తున్నది.
అలా ఒకటి కాదు.. రెండు కాదు… ఏకంగా పది గంటల పాటు ఆమె నరకయాతన అనుభవించింది. రాత్రంతా ఆ చిమ్మ చీకట్లో రక్తపు మడుగులో చల్లగా చలికి గజగజ వణుకుతూ ఉండిపోయింది. ఆ కనురెప్పలు క్షణం పాటు కూడా మూతపడలేదు. వెలుగు రేఖల కోసం ఎదురుచూస్తున్నాయి ఆశగా. తెల్లవారింది. బలంగా ఓ మూలకో మిగిలి ఉన్న కొద్దిపాటి శక్తిని కూడగట్టుకుని పడుతూ లేస్తూ రోడ్డుకు చేరింది. అటుగా వస్తున్న బైక్ అతను చూశాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని చిన్నాపూర్‌కు చెందిన సుంకరి ప్రియాకం దీన గాధ ఇది.
ప్రేమించుకున్నారు. అర్థం చేసుకున్నామనుకున్నారు. కానీ వాడో సైకో. ప్రేమోన్మాది. నెంబర్ బిజీ వస్తే చాలు ఎవడితో మాట్లాడుతున్నావని వేధించేవాడు. ఇలా కుదరదు ఇద్దరం విడిపోదామనుకున్నారు. సరే అని ఒప్పందానికి వచ్చాడు. కానీ వాడు పగతో రగిలిపోయాడు. తనను కాదని వేరొకరితో తిరుగుతుందా..? చంపాలి ఎలాగైనా అని నిర్ణయించుకున్నాడు. పుట్టిన రోజు సాకుతో బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని ఈ దురాఘాతానికి పాల్పడ్డాడు. బాధితురాలిచ్చిన సమాచారం మేరకు ఆ సైకోను 36 గంటల్లొనే పట్టుకున్నాడు మోపాల్ ఎస్సై జీ మహేశ్ అండ్ టీం…