రోజులు మారుతున్నా రాజ‌కీయాలు మార‌డం లేదు. టెక్నాల‌జీ పెరిగి సోష‌ల్ మీడియా రాజ్య‌మేలుతున్నా ఇంకా పాత చింత‌కాయ ప‌చ్చ‌డి విధానాలే రాజ‌కీయాల్లోఅమ‌ల‌వుతున్నాయి. ఓ పార్టీ స‌భ పెడితే దానికి బ‌హిరంగ స‌భ అనో, భారీ బ‌హిరంగ స‌భ అనో పేరు పెట్టి వ్య‌య ప్ర‌యాసాల కోర్చి .. స‌భ సక్సెస‌యింద‌న‌డానికి వ‌చ్చిన జ‌నాన్ని చూపించ‌డం ఇప్ప‌టికీ అన్ని రాజ‌కీయ పార్టీల నాయ‌కులు అవ‌లంబిస్తున్నారు. మా స‌భ‌కు ల‌క్ష‌, మా పార్టీ బ‌హిరంగ స‌భ‌కు ప‌ది ల‌క్ష‌లు… ఇలా లెక్క‌లు లెక్క‌కు మించి వాస్త‌వానికి విరుద్దంగా లాజిక్కుకు అంద‌కుండా ఉంటాయి. పేప‌ర్ల‌లో ఆ జ‌నం వ‌చ్చిన ఫోటో ప‌డితే ఆ పార్టీ పంట పండిన‌ట్టే. అలా స‌భ స‌క్సెస్‌కు, పార్టీ మ‌నుగ‌డ‌కు, ఎన్నిక‌ల్లో ఓట్లు రాల్చేందుకు స‌భ‌ల‌కు వ‌చ్చిన జ‌నాలే కొల‌మానం ఇప్ప‌టికీ మ‌న నాయ‌కుల‌కు. అస‌లు డ‌బ్బులు ఇవ్వందే… ఖ‌ర్చు పెట్టందే… ర‌వాణా సౌక‌ర్యం ఏర్పాటు చేయందే…. వ‌చ్చే పోయేట‌ప్పుడు తాగుడు, తిండి పెట్టందే ఎవ‌రైనా.. ఒక్క‌డంటే ఒక్క‌డు స‌భ‌ల‌కు వ‌స్తాడా? వ‌స్తారు. ఎవ‌రు..? ఆ పార్టీ నాయ‌కులు. కార్య‌క‌ర్త‌లు కూడా రారు. వాళ్ల‌కూ ఖ‌ర్చు పెట్టాల్సిందే. నాయ‌కులకు పార్టీ మ‌నుగ‌డే ముఖ్యం.. అది బ‌తికి బ‌ట్ట‌క‌డితేనే వాళ్ల ఉనికి. ఆ త‌ర్వాత ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ఆ జ‌నాల వద్దే మ‌ళ్లీ పైస‌లు గుంజి సంపాదించుకోవచ్చు. వీళ్ల సంగ‌తి వ‌దిలేద్దాం.

పైస‌లియ్యందే స‌భ‌ల‌కు జ‌నం రారు. మ‌రి బాగా జ‌నం వ‌చ్చారు కాబ‌ట్టి మా స‌భ స‌క్సెస్ అని చెప్పుకునే నాయ‌కులారా..

మేం అంత పెద్ద ఖ‌ర్చు పెట్టాం కాబ‌ట్టే.. ఇంత జ‌నం వ‌చ్చార‌ని ప‌రోక్షంగా ఒప్పుకున్న‌ట్టే క‌దా.

స‌భ‌ల‌కు జ‌నం రాకున్నా సోష‌ల్ మీడియాలో అది ప్ర‌సారం అవుతుంది. టీవీ చానెళ్లు పైస‌లు తీసుకుని కొన్ని తీసుకోక కొన్నపెద్ద‌గా చిన్నగ‌నో వార్త‌లు వేస్తాయి. ప్ర‌సారం చేస్తాయి. మ‌రి ఈ జ‌నం కొల‌మానం ఎంత‌కాల‌మో…?

ప‌ని లేని కాలంలో నాలుగు పైస‌ల‌న్నా దొరుకుత‌య్ ఇది మంచిదే అంట‌రా..? ఓకే. కానీ జ‌నాల‌ను త‌ర‌లించే స‌మ‌యంలో చూపిన ఉత్సాహం తిరిగి పంపేట‌ప్పుడు ఉండ‌దు. తాగెటోడు తాగుత‌డు….ట‌క్క‌ర్ల‌య్యేటివి అవుత‌యి… పోయేటోడు పోత‌డు. ఉన్నోడు ఇంటికి పోత‌డు. నాయ‌కుల‌కు ఇవ‌న్నీ అస‌వ‌రం లేదు. జ‌నం ఫోటో పేప‌ర్‌లోరేపు పెద్ద‌గా రావాలె. భారీగా హాజ‌రైన జనం అని అక్ష‌రాలు క‌నిపించాలి. అంతే… వ‌చ్చేది జ‌నం. మ‌ధ్య‌లో చ‌చ్చేది జ‌నం