ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ రాక‌ను టీఆరెస్సే అన‌వ‌స‌రంగా హైప్ క్రియేట్ చేసింది. భ‌య‌ప‌డింది. ముందు జాగ్ర‌త్త పేరుతో నానా హంగామా చేసింది. అన‌వ‌స‌ర ఖ‌ర్చును పెట్టింది. హోర్డింగుల‌తో హోరెత్తించింది. పేప‌ర్ల‌లో మొద‌టి పేజీ యాడ్లు క‌బ్జా చేసేసింది. ప్ర‌శ్న‌ల పేరుతో ఇరుకున పెట్టాల‌ని చూసింది. నిలదీత‌ల‌తో రెచ్చ‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నించింది. ఆఖ‌రికి బ‌హిరంగ స‌భ‌లో టీఆరెస్‌ను తిట్టించి…. తెలంగాణ ప్ర‌జ‌ల మ‌ద్ద‌త‌ను టీఆరెస్ కూడ‌గ‌ట్టాల‌ని చూసింది. అన్నీ చేసినా.. మోడీ మాత్రం అద‌ర‌లేదు.. క‌ద‌ల‌లేదు. క‌ద‌లిక లేదు. స్పంద‌న లేదు. ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు లేదు. ఆరోప‌ణ‌ల అస్త్రాలూ సంధించ‌లేదు. అంద‌రినీ ఒక్క‌చోటికి తెచ్చి త‌న బ‌ల‌గాన్ని బ‌లిమిని ప్రద‌ర్శించి టీఆరెస్‌ను హ‌డ‌లెత్తించ‌డంలో మాత్రం మోడీ స‌క్సెస‌య్యాడు.

వేదిక మీద నుంచి అంద‌రితో తిట్టించాడు. నో లిమిట్స్‌, నో కండిష‌న్స్‌… ఎడాపెడా… పాత‌వే కానీ కొంచెం ఘాటుగా. ఇక మోడీ వ‌ర‌కొచ్చే స‌రికి ఏం మాట్లాడ‌తాడో అని అంతా ఉత్కంఠ‌గా ఎదురుచూశారు. బీజేపీక‌న్నా టీఆరెస్సే మోడీ ప్ర‌సంగంపై రోమాలు నిక్క‌బొడుచుకుని మ‌రీ విన్న‌ది. కానీ అనూహ్యంగా ఎవ‌రికీ అంద‌కుండా ప్ర‌సంగం మొత్తం అభివృద్ది జ‌పం పైనే సాగింది. డ‌బుల్ ఇంజ‌న్ కావాల‌ని కోరుకుంట‌న్నార‌ని, ఇక్క‌డ బీజేపీ హ‌వా పెరిగింద‌ని, న‌మ్మ‌కం పెంచుకుంటున్నార‌ని చెప్పుకొచ్చాడు. తెలంగాణ‌కు ఏమేమి చేశామో ఏవో లెక్క‌లు చెప్పి ముగించేశాడు. మోడీ రాక‌.. ఇటు టీఆరెస్‌లో అటు బీజేపీలో మాత్రం క‌దిలిక తెచ్చింది. బీజేపీలో కొంచెం జోష్ పెరిగింది. టీఆరెస్‌లో బీజేపీని పెద్ద‌గా చూపి త‌మ‌ను తాము భ‌య‌పెట్టుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. త‌మ‌కు ప్ర‌ధాన శ‌త్రువు బీజేపీయేన‌ని మ‌రీ ఢంకా బ‌జాయించి చెప్పుకున్నాడు కేసీఆర్‌. ఇక్క‌డే మోడీ స‌క్సెస‌య్యాడు.

టీఆరెస్‌కు ఎవ‌రు స‌ల‌హాలిస్తారో..? కేసీఆరే ముందు జాగ్ర‌త్త పేరుతో అన‌వ‌స‌రంగా బెంబెలెత్తాడో తెలియ‌దు కానీ…… బీజేపీ నెత్తిన పాలు పోసిన‌ట్లే చేశారు. మోడీ మాత్రం సైలెంటుగా చిచ్చు రేపి.. అభివృద్ది మంత్రం జ‌పించి.. లోప‌ల కోర్ క‌మిటీలో తీర్మానాల పేరుతో భ‌విష్య‌త్తు కార్య‌చ‌ర‌ణ బోధించి కింక‌ర్త‌వ్యం హిత‌బోధ చేసి ప‌య‌న‌మ‌య్యాడు.

You missed