చంద్రబాబు ఆ నాడు తీసుకున్న స్టాండ్ ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ అమలు చేస్తున్నాడు. ఏపీలో నాడు జరిగిన సన్నివేశాలే.. ఇప్పుడు తెలంగాణలోనూ కనిపిస్తున్నాయి. మోడీపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి ఆనాడు బాబు చతికిలబడ్డాడు. అప్పుడు కేసీఆర్ మోడీకి స్నేహమస్తమందించాడు. ఇప్పడు ఇదే కేసీఆర్ మోడీపై తిరుగుబాటు జెండా ఎగరవేసి ప్రత్యక్ష యుద్దానికి బరిగీసి నిలిచాడు. రేపు, ఎల్లుండి మోడీ పర్యటన సందర్భంగా తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మోడీ బై..బై. మోడీకో హటావో దేశ్ కో బచావో నినాదాలు అప్పుడు బాబు వినిపించాడు. ఇప్పుడు కేసీఆర్ వినిపిస్తున్నాడు.
మోడీతో ఆనాడు బాబు వైరం పెట్టుకోవడంతో రాజకీయంగా ఆయనకు తీవ్ర నష్టాన్నే తెచ్చిపెట్టింది. ఐటీ దాడులు, ఈడీ దాడులు …అంటూ మోడీ .. బాబను చక్రబంధంలో ఇరికించేశాడు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టనీయకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నాడు. జగన్‌కు అధికారమందించేందుకు దారి సుగమం చేశాడు. ఇప్పుడు ఇదే తోవలో కేసీఆర్ పోతున్నాడు.
మొన్నటి వరకు ఇద్దరి మధ్య పరోక్ష యుద్దమే ఉండేది. మొదట కేసీఆర్‌తో పెట్టుకున్నది మోడీనే. ఆర్థికంగా తెలంగాణను దెబ్బకొట్టేందుకు మోడీ అన్ని ప్రయోగాలు చేశాడు. కేంద్రం పరిధిలోని ఎఫ్ఆర్బీఎం ను కంట్రోల్ చేశాడు. అప్పులు పుట్టకుండా చేశాడు. ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పులకు వడ్డీలు పెంచాడు. ఫైనాన్స్ కమిషన్ నుంచి అప్పులు రాకుండా అడ్డుకోగలిగాడు. ఇవన్నీ తెలంగాణను ఆర్థికంగా అడ్డుకుని కేసీఆర్‌ను దెబ్బకొట్టేందుకు మోడీ చేసిన ఎత్తుగడలు. వీటిని గమనించిన కేసీఆర్ తనదైన వ్యూహాలతో ముందుకు పోతున్నాడు. బరిగీసి ఇక ప్రత్యక్ష యుద్దమే అని ప్రకటించాడు.
మోడీ హైదరాబాద్ పర్యటన ద్వారా తన తిరుగుబాటును మరింత బలంగా వినిపించేందుకు , మోడీకి కనిపించేందుకు కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నాడు. అదే తరహాలో ఆయన వ్యవహారశైలి కొనసాగుతున్నది. ఈ సమయంలో బీజేపీ కార్పొరేటర్లను టీఆరెస్‌లోకి లాగడం… హైదరాబాద్‌లో ఎక్కడా బీజేపీ హోర్డింగులకు అవకాశం లేకుండా అన్నీ సర్కార్ యాడ్స్‌తో నింపేయడం… యశ్వంత్‌కు భారీ స్వాగతం…ఇవన్నీ మోడీని రెచ్చగొట్టే చర్యలే.
ఈ ఇద్దరు పోరులో ఎవరు గెలుస్తారు…? ఎవరు నిలుస్తారు…??
ఇప్పుడు ఇదే చర్చ అంతటా జరుగుతోంది. తెలంగాణలో రాజకీయం వేడెక్కుతుంది.