బాల్కొండ వాగుల్లో ట్రిపుల్ ‘ఆర్’ జలయజ్ఞం
వీఎస్’ఆర్’ కల
వీపీ’ఆర్’ కృషి
కేసీ’ఆర్’ సహకారం
షేక్ హ్యాండ్ చెక్‌డ్యాంలతో జల వైభవం
వాగుల్లో మంత్రి వేముల వాటర్ మాస్టర్ అచీవ్మెంట్
40వేల ఎకరాలకు ఉపయోగంగా మారిన వాగులు
మరో ఏడు చెక్‌డ్యాంలు మంజూరు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కిలో మీటర్ల కొద్ది పొడువున వున్న వాగుల్లో వాటర్ అచీవ్మెంట్ కోసం మాస్టర్ వర్క్ జరుగుతున్నది. సీమాంధ్ర పాలకుల హయాంలో వారి పార్టీలు ‘వాగుల వరదను ఆపడమా ఎహే అదెలా సాధ్యం..?’ అన్నారో… అదే వాగుల్లో ‘ఇదిగో ఇలా సాధ్యం’ అని చేసి చూపిస్తున్న మాస్టర్ వర్క్ అక్కడ జరుగుతున్నది. అడుగడుగునా చెక్ డ్యామ్‌ల నిర్మాణాలతో వట్టిపోయిన వాగులు మూడు కాలాలు జల జల జాడలతో ఉంటూ నలభై కిలో మీటర్ల పొడువునా వాగులకు ఇరు వైపులా సాగు వైభవం సాగాలన్న కలలు కన్నారు దివంగత రైతు నేత వీఎస్ఆర్ (వేముల సురేందర్ రెడ్డి). దీనికి వీఎస్ఆర్ తనయుడు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వీఎస్ఆర్ ( వేముల ప్రశాంత్ రెడ్డి) తన కృషిని అందిస్తున్నారు. మంత్రి కృషికి ఆయనను కన్నబిడ్డలా ప్రేమగా చూసుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు.
బాల్కొండ నియోజకవర్గంలోని ప్రధాన వాగులైన పెద్దవాగు, కప్పలవాగుల్లో ఇది వరకే 16 చెక్ డ్యామ్‌లతో రైతులకు భూగర్భ జలాలు అందుతున్నాయి. వాగులకు రెండు వైపులా పచ్చని పంటలు సాగవుతున్నాయి. ఈ తరుణంలో ఏకంగా మరో ఏడు చెక్ డ్యామ్‌ల మంజూరు రావడంతో రైతుల్లో ఎంతో సంతోషం నెలకొన్నది. వారి గ్రామాల వాగుల జల వైభవం కోసం ఈ ముగ్గురు నేతల కృషిని ఇప్పుడు మరోసారి వారు గుర్తు చేసుకుంటున్నారు. ‘ఇది కేసీఆర్… వీపీఆర్.. వీఎస్ఆర్లతో కూడిన త్రిపుల్ ‘ఆర్’ జలయజ్ఞం’ అని అభివర్ణిస్తున్నారు.
ఉద్యమకాలంలో నిధులు, నీళ్లు, నియామకాలు ట్యాగ్‌లైన్‌లో నీళ్లు అనేది బాల్కొండ నియోజకవర్గంలో బాగా అవసరమైనదిగా కొనసాగింది. నియోజకవర్గంలోనే గోదావరి నదిపై ఎస్సారెస్పీ ఉన్నా కొంతంటే కొంత మాత్రమే ఉపయోగపడేది. నియోజకవర్గం నడిమధ్య గుండా 32 గ్రామాల భూముల చెంత నుంచే దాదాపు 45 కిలో మీటర్లు పారే పెద్దవాగు, కప్పల వాగు ఉన్నా పడే ప్రతి చినుకూ వరదై గోదావరిలోనే కలిసేది. మరి ఏదారి వెతికేది అనే ఆవేదన రైతుల్లో ఉండేది.
‘స్వరాష్ట్రం సిద్ధిస్తే ఈ సమస్యలకు పరిష్కారం గ్యారెంటీగా దొరుకుతుంద’ని ఉద్యమ కాలంలో రైతు నేత వేముల సురేందర్‌రెడ్డి ఇక్కడి రైతులతో చెప్పేవారు. తండ్రి అడుగు జాడల్లో , ఉద్యమ బాటలో నడిచిన వేముల ప్రశాంత్ రెడ్డి స్వరాష్ట్రం రాగానే వెంటనే తన కృషిని మొదలు పెట్టారు. ఈ రెండు వాగుల్లో 20 నుంచి 30 వరకు చెక్ డ్యామ్‌లు నిర్మిస్తే వాగుల నిండా ఎక్కడి నీరు అక్కడే నిలిచి వాగులకు రెండు వైపులా రెండేసి కిలో మీటర్లు భూగర్భ జలాలు వృద్ధి చెందేలా చేయవచ్చని భావించి దశల వారీగా సీఎం కేసీఆర్ సహకారంతో చెక్ డ్యామ్‌లు మంజూరు చేయించారు. ఇలా 16 చెక్ డ్యామ్‌లు పూర్తయ్యాయి. 40వేల ఎకరాలకు సాగునీటి ప్రయోజనం అందుతున్నది. తాజాగా రూ. 56.9 కోట్లతో కొత్తగా 7 చెక్ డ్యామ్‌లు మంజూరయ్యాయి.