#InnarFeelings

మొన్న ఐతారం రోజు ఓ దోస్తుగాడు రమ్మంటే ఐదు నక్షత్రాల హోటల్ పోయినం …

కారు దిగక ముందే సూటు బూటు ఎసుకున్నాయన డోరు తీసి వినయంగా నవ్వుతూ నిలబడే…

నాలో నేనే నవ్వుకున్నా
భలే నటిస్తున్నాడే అనుకొన్నా
పైసా మహత్యం …

అప్పటికే మొటివేషన్ సెషన్ స్టార్ట్ అయినట్లు ఉంది.
హడావుడిగా లోపలికి వెళ్ళాం.
లోపలంతా చీకటి..
డయాస్ మీద ఒక 25 ఏళ్ల కుర్రాడు సూటు,బూటు ఏసుకొని ఏదో చెపుతున్నాడు.

హాలు అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది.
చీకట్లో ఒక సారి చుట్టూ గమనించాను.
అంతా సూటు , బూటు తో వచ్చిన వాళ్లే …

జీవితం గురించి …
సక్సెస్ గురించి …
ఫెయిల్యూర్స్ గురించి …
స్పీచ్ జోరుగా నడుస్తుంది.

అటు ఇటు కదులుతూ స్పీచ్ …
వాయిస్ బాగుంది

తలుచుకొంటే సాదించగలవు అనే కాన్సెప్ట్ ను మెదడు లోకి ఎక్కించాలని తాపత్రయం.

మీతో అవుతోంది…
మీరు చెయ్యగలరు …
వాయిస్ సౌండ్ బాక్సుల్లో
దద్దరిల్లుతుంది.

మెల్లగా లేచి బయటకు వచ్చా …

అప్పడికి నా మిత్రుడు బయటకు వద్దు కూర్చో డిన్నర్ ఇక్కడే …
ఇద్దరం కలిసి వెళదాం అని అంటూనే ఉన్నాడు

నేను చిన్నగా నవ్వి బయటకు వచ్చా.

బయటకు రాగానే రిలాక్స్ గా అనిపించింది.
లోపల ఏ.సి గాలి కంటే ప్రకృతి గాలే నాకు బాగా అనిపించింది

నీతో అవుతుంది … నువ్వు చెయ్యగలవు అని
ఒక మనిషి చేపితే తప్ప తెలియని స్టేజ్ లో మనిషి ఉన్నాడా …??

నాకైతే చాలా చిత్రంగా అనిపించింది.

ఆలోచించడం మర్చిపోయిన మనిషి ప్రతీ దానికి ఇంకొకరు చేపితే తప్ప ఏ పని చెయ్యలేక పోతున్నాడా …??

అయినా ….

అవకాశాల గురించి ఎవరో చేపితే తప్ప స్వతహాగా ఎందుకు ఆలోచించలేక పోతున్నారు …??

రోడ్డు మీద నడుస్తూ కిలోమీటర్ దూరం వరకు అగ్గిపెట్ట దొరకక సిగరెట్ వెలిగించ లేకపోయిన మనిషి ఆ ఏరియాలో సిగరెట్టు కొట్టు పెట్టుకొని లైఫ్ లో సెటిల్ ఆయిన్ వ్యక్తులు ఎంతోమంది.

ఎవరు మొటివేట్ చేశారు ఇలాంటి వాళ్ళని.

టెక్నాలజీ పరంగా మనిషి అభివృద్ధి చెందినా ఇంకా దేనికైనా రాసుండాలి. గీత గీసుండాలి అని సొల్లు కబుర్లతో ఎందుకు కాలాన్ని వృధా చేసుకొంటున్నారు.

ఎండాకాలం ఐస్ క్రీమ్ అమ్మితే లాభాలు వస్తాయి
వర్షాకాలంలో వేడి వేడి మిర్చి బజ్జిలు అమ్మితే లాభాలు వస్తాయి.

కాలనుకనుగుణంగా ఆలోచించగలిగితే సక్సెస్ అనేది చాలా ఈజీ గా స్వంతమవుతుంది.

ఇదే చిన్న లాజిక్ చాలా మంది మర్చిపోతున్నారు.

సో ….

నా దృష్టిలో స్వంతగా ఆలోచించకుండా, టెక్నీకల్ స్కిల్స్ లేకుండా మనిషి అంత తొందరగా జీవితంలో సెట్ కాలేడు.

మనిషి అవసరాల్ని బట్టి , పరిస్థితుల్ని బట్టి వ్యాపారం చేసుకునేవాడు విజయం సాదించినంతగా …
అప్పటికప్పుడు మోటివేషన్ స్పీచ్ లు విన్న వాళ్ళు సక్సెస్ అయిన దాఖాలాలు లేవ్వు.

వెలుదామా నా దోస్తు కూడా అప్పుడే బయటకు వస్తూ అన్నాడు.
పరవాలేదు. నువ్వు ఉండు నేను వెళ్లిపోతాను.
ప్రోగ్రామ్ అయ్యాక నువ్వు వచ్చేసెయ్యి అంటూ నేను మెల్లగా ముందుకు కదిలాను.

లేదు నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించడం లేదు. పద అంటూ బయటకు వచ్చాడు.
కారుదగ్గర మళ్లా సూటు వేసుకున్న ఆయన నవ్వుతూ దగ్గరికొస్తున్నాడు.

నా స్నేహితుడు వంద నోటు తీసి అతని చేతికి ఇచ్చాడు.

అంత అవసరమా అని అడిగా …
సొసైటీలో కొన్నిసార్లు మనం కూడా ఉన్నట్లే నటించాలి .. తప్పదు కదా …

కారు ముందుకు పరిగెడుతుంది.
ఏ.సి ఆఫ్ చేసి విండోస్ కిందికి దించాను.
ట్యాంక్ బండ్ మీద నుండి కారు పరిగెడుతుంది.

చిన్నగా చినుకులు మొదలయ్యాయి.
ట్యాంక్ బండ్ మధ్యలోకి వచ్చేసరికి చినుకులు పెద్దవయ్యాయి.

ట్యాంక్ బండ్ మధ్యలో ఒక పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తూ ఒక అమ్మ.

ఇంత వర్షంలో ఆ దృశ్యం నన్ను ఒక్క సారిగా కారు ఆపేలా చేయించింది.

ఈ వర్షంలో తడవడం అవసరమా

నా మిత్రుడి సనుగుడిని పట్టించుకోకుండా కిందికి దిగాలని డిసైడ్ అయ్యాను.

సూటు తడుస్తుందేమో …

ఏమి కాదు అంటూ పైన కోటు విప్పి కారులో పడేసి కిందికి దిగాను

చల్లటి చినుకులు ఒంటిని ముద్దాడాయి.

శరీరం చల్లబడింది. అంత కంటే ఎక్కువగా మనస్సు కూడా …

ఇద్దరం తడుస్తూ కంకులు అమ్మే అమ్మదగ్గరికి వెళ్ళాం.

నీళ్లు పొయ్యిని చలార్పకుండా ఉండడానికి పైన ఒక కవర్ తో గట్టిగా కట్టినట్లు కనబడుతుంది
మమ్మల్ని చూడగానే నవ్వుతూ ఎన్ని కావాలి బాబు అంది.
వేడిగా రెండు కాల్చి ఇవ్వు అవ్వా అన్నా.

అవ్వ కంకుల్ని కాలుస్తుంది. అప్పడిదాక నేను వంటి మీద పడుతున్న వర్షపు నీటి చుక్కల్ని ఆస్వాదిస్తున్నా …
రెండు కాల్చి చెరొకటి ఇస్తూ
ఒకటి 20 రూపాయలు బాబు అంది.
నేను వంద రూపాయలు ఇచ్చి వేగంగా వచ్చి కారులో కూర్చున్నా …
బాబు మిగితా చిల్లరా … అవ్వ 40 పోను మిగితా చిల్లర 60 ఇవ్వడానికి పిలుస్తుంది.
వద్దు అవ్వా వుండనివ్వు. అంటూ కారు స్టార్ట్ చెయ్యమని మా వాడికి చెప్పా …
కారు స్టార్ట్ అయ్యింది.

అదేంది రా …

అక్కడ వాడికి వంద రూపాయలు ఇస్తే అవసరమా అన్నావు.
ఇక్కడేమో ఆ అవ్వ పిలుస్తున్నా డబ్బులు వద్దు అని వదిలిపెట్టి వచ్చావు.
ఎందుకు అన్నాడు.

నేను నవ్వా …

ఎందుకంటే నా ఫీలింగ్స్ వాడికి ఎట్టి కోశానా అర్థం కావు.
సిల్లీగా కూడా అనిపించి వచ్చు.
డబ్బుకోసం అందరికి సలాము కొట్టే వాడికి ..
తన కుటుంబం కోసం ఈ వయస్సులో కూడా ఇంత కష్ట పడుతున్న ఈ అవ్వకు ఎంత తేడా …

వర్షం జోరందుకొంది …

కారులో రేడియో ఎఫ్.ఎం లో పాత హిందీ పాట వస్తుంది.
వర్షం స్పీడ్ పెరిగింది
కారు విండో పైకి ఎక్కించి మెల్లగా వెనక్కి వాలి కూర్చున్నా …

‘ ప్యార్ హువా ఎక్ రార్ హువా ‘ … నాకు చాలా ఇష్టమైన రాజ్ కపూర్ సాంగ్

నా పెదవులు పాట తో జత కలిసాయి …. 💞💞

Manjeera Srinivaas

You missed