నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత మరొకసారి విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో విమర్శలు చేశారు. మెట్పల్లిలో ఇవాళ జరిగిన కోరుట్ల నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిచినా మర్యాద ఇవ్వాలని, అందుకే ఎంపీగా అర్వింద్ ఇంతకాలం అవకాశమిచ్చి ఏమైనా చేస్తారేమో చూశామని, అతను ఏమీ చేశాడో ప్రజలకు అవగతమయ్యిందన్నారు. ఇప్పటి వరకు ఆయన పార్లమెంటుకు తెచ్చిన నిధులు 1.92 కోట్ల రూపాయలని, తలా రెండు వందలు కూడా తేలేకపోయాడని ఎద్దేవా చేశారామె. పసుపు బోర్డుని చెప్పి ఏదో ఆఫీసు తెచ్చానని చెబుతున్నాడని, ఆ ఆఫీసు కూడా తన హయాంలో వచ్చిందేనన్నారు. ఇప్పుడు అమెరికా యాత్ర చేస్తున్న అర్వింద్.. అక్కడ కూడా అబద్దాలు వల్లె వేస్తున్నాడని, మోడీ హైతో మున్కిన్ అంటూ గొప్పలు చెబుతున్నాడని విమర్శించారు. మోడీ హైతో మున్కిన్ కాదు.. ముష్కిల్ అని .. ఆయన హయాంలో జీడీపీ పాతాళానికి పడిపోతే.. ధరలు ఆకాశానికంటాయని , పెట్రోల్, డీజీల్, పప్పులు, నూనెలు… అన్ని ధరలూ పెరిగిపోయాయని… ఈ విషయాలను అమెరికా ప్రజలకు అర్వింద్ చెప్పాలని విమర్శించారామె.
బీజేపీ ప్రభుత్వంలో రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పడిపోయిందన్నారు కవిత. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్నారు..? ఏవీ…? ప్రతీ ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు.. ఎక్కడ..? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి బీజేపీ గురించి మాట్లాడటం లేదని, ఆ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆరెస్ ప్రభుత్వమని, ఊర్లలో యువకులు ఆగ మాగం జెండాలు పట్టుకుని బైకుల పై తిరుగుతున్నారని, ఈ తెలంగాణ తెచ్చుకున్నదే వారి బంగారు భవిష్యత్తు కోసమని గుర్తుంచుకోవాలని కవిత హితవు పలికారు. 95 శాతం ఉద్యోగాలు ఇక్కడి యువకులకేనని , పోటీ పరీక్షలకు సిద్దమై ఉద్యోగాలు సాధించుకోవాలని ఆమె కోరారు.