తెలంగాణ సర్కార్ ఇచ్చే ఆసరా పింఛన్లు వాస్తవంగా చాలా కుటుంబాలకు ఆసరాగా ఉంటున్నాయి. వృద్దాప్య, వితంతు పింఛన్లు వారిని ఆదుకుంటున్నాయి. కొత్తగా పింఛన్‌కు అర్హత ఉండి.. దరఖాస్తు చేసుకుని కలెక్టర్ల ఆమోదం పొంది సర్కార్ వద్ద పెండింగ్‌లో ఉన్న పింఛన్‌దారుల సంఖ్య మూడు లక్షల వరకు ఉంది. వీరంతా దరఖాస్తు చేసుని పింఛన్ తీసుకోవడానికి అర్హత సాధించి కూడా మూడేండ్లవుతుంది. అంటే మూడేళ్ల నుంచి పింఛన్ ఎప్పుడు వస్తుందా..? ఎదురుచూస్తున్నారు. ప్రతీ నెల జిల్లాల్లో 500 నుంచి 600 మంది పింఛన్‌దారులు చనిపోతూ ఉన్నారు. ఈ చనిపోయిన వారి ప్లేస్‌లో కొత్తవారికి ఇచ్చినా కొత్తచాలా మందికి ఆసరా అండగా ఉంటుండే. కానీ సర్కార్ అలా చేయడం లేదు. నిధుల లేమి కారణంగా భారం తగ్గించుకోవడానికి కొత్త పింఛన్లు ఇవ్వడం మానేసింది.
ఉదాహరణకు ఒక్క జిల్లాలో గత ఏడాది మొత్తం పింఛన్లకు కలిపి 58 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టేది. ఇప్పుడు అది 52 కోట్లకు చేరింది. అంటే 6 కోట్ల భారం ప్రభుత్వానికి తగ్గింది. కానీ.. కొత్త పింఛన్లు ఖాళీ అయిన వాటి స్థానంలో ఆడ్ కావడం లేదు. ప్రతినెలా జీతాలే సమాయానికి రాని దుస్తితి ఉన్న సమయంలో ఇంకా కొత్త పింఛన్లు ఎక్కడ ఇస్తారు..? ఎప్పుడిస్తారు..? అనే రీతిలో అధికారులే వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పండుటాకులకు ఈ ఆసరా ఎంతో అవసరం. కొత్తగా చాలా మంది దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. ఎంక్వైరీ చేసిన అధికారులు వీరు ఆసరాకు అర్హులేనని కలెక్టర్లకు నివేదిస్తున్నారు. కలెక్టర్ వాటిని ఆమోద ముద్ర వేసి ప్రభుత్వానికి పంపుతూనే ఉన్నారు. కానీ అవి రిలీజ్ కావడం లేదు. మూడేండ్ల నుంచి ఈ ఫైల్ సర్కారు అటకమీదే బూజు పట్టి ఉంది.
గత ఎన్నికల్లో 57 ఏండ్లు నిండిన వారికి వృద్దాప్య పింఛన్ ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు వాటిని త్వరలోనే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా 7.50 లక్షలు ఉన్నాయి. వీటికి మోక్షం లభిస్తుందా? ఎప్పుడు..? కొత్త పింఛన్ దారులకు ఎప్పుడు మోక్షం లభిస్తుంది..? ఇవి ఇప్పుడు జవాబు దొరకని ప్రశ్నలుగానే ఉన్నాయి.