రైతుల చుట్టూ రాజకీయాలకు తిరుగుతున్నాయి. నాయకులు దృష్టి రైతులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మొన్నటి దాకా వరి వేయొద్దని , వేస్తే ఉరే అని చెప్పిన కేసీఆర్.. కేంద్రం వినకపోయే సరికి.. రైతులు వరే వేసే సరికి కొనక తప్పలేదు. ఈ ఉపద్రవం నుంచి తప్పించుకునేందుకు, రైతులను ప్రసన్నం చేసుకునేందుకు మొత్తానికి ధాన్యం భారం కేసీఆర్‌పై పడింది. రైతుబీమా, రైతుబంధు ఇచ్చినా… ఇప్పుడు వరి ధాన్యం కొనకపోతే మొత్తం సీన్ రివర్స్ అయ్యేది . అది కేసీఆర్‌కు తెలుసు. అందుకే ఆలస్యం చేయలేదు. ధాన్యం కొంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ దృష్టి కూడా రైతు పైనే పడింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలే ఎజెండాగా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో 6 న రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏర్పాటు చేస్తున్న వరంగల్ రైతు సంఘర్షణ సభను ఇక్కడి రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర రైతాంగానికి ఏం చేయనున్నామో ఈ వేదికగా రాహుల్ ప్రకటించనున్నారు.
జాతీయ వ్యవసాయ విధానంపైనా కీలక ప్రకటన చేయనున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించి వారితో సహపంక్తి భోజనం చేయనున్నారు. 7న ఓయూ విద్యార్థులతో ముఖాముఖి లో రాహుల్ పాలుపంచుకోనున్నాడు. వరంగల్ సభ వేదికగా రాహుల్ ప్రకటించే రైతు డిక్లరేషన్ ఏ మేరకు ఇక్కడి కాంగ్రెస్‌ను ఆదుకుంటుందో..ఈ సభ ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి. రానున్న ఎన్నికలే లక్ష్యంగా రైతు కేంద్రంగా ఈ డిక్లరేషన్‌లో తమ విదివిధానాలు ప్రకటించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితేమో గానీ, ఇక్కడ మాత్రం రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా వ్యతిరేకత లేదు.
రైతుబీమా, రైతు బంధు పథకాల పట్ల రైతులు సంతోషంగానే ఉన్నారు. రుణమాఫీ అమలు చేయకపోవడం, ధరణి లోటుపాట్లు ఇతర విషయాలపై కొంత అసంతృప్తి ఉంది. మూస దోరణిలో విధివిధానాలు ప్రకటిస్తే ఇక్కడ కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ ఉండదు. ఇక్కడ క్షేత్రస్థాయిలో రైతు ఇంకా ఏం కోరకుంటున్నాడు..? ప్రభుత్వం నుంచి ఇంకా రైతులకు అందాల్సిన సహాయం ఏంటి…? రైతు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నాడు..? ఎక్కడ లోపముంది..? ఇవన్నీ అన్వేషించాలి. ఆ మేరకు హామీలు ఇస్తే ప్రయోజనం ఉంటుంది.