ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతున్నాయో…. అని ఢంకా బజాయించి అంతా మొత్తుకుంటున్న తరుణంలో ఏపీ తీసుకున్న నిర్ణయం ఇది. రేపటి నుంచి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ పెడుతున్నారంట. దీని వల్ల ఉపయోగమేమైనా ఉంటుందా? గతంలో మాదిరిగానే ఏదో చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం సమర్థించుకోవడానికి తప్ప.. ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. జనాలను ఇబ్బందులకు గురిచేయడం తప్ప. ఉదయం నుంచి రాత్రి వరకు తిరుగుతూనే ఉంటారు. అంటితే గింటితే.. అప్పుడే ఉంటుంది. అప్పుడు జాగ్రత్తలు తీసుకుని ఎవరి పనులు వారు చేసుకుంటే సరిపోతుంది.
నైట్ కర్ఫ్యూ పేరుతో మరింత భయాందోళనలు క్రియేట్ చేయడం కూడా అవుతుంది. ఇక లాక్ డౌన్ కూడా పెడతార్రోయ్ అని ప్రచారం చేసుకునే బ్యాచూ ముందు వరుసలో ఉంటుంది. ఉన్న వ్యాపారాలు దివాళా తీస్తాయి. అసలే అంతంత మాత్రానా ఉన్న బిజినెస్ ..బిక్కముఖం వేసుకుంటుంది. ఆర్థిక స్థితి మరింత దిగజారుతుంది. పనులు దొరకవు.
లిక్విడ్ క్యాష్ ఎవరూ బయటకు తీయరు. పెట్టుబడులు లేక.. కొత్త పనులు నడవక.. ఉపాధి దొరకక.. ఉద్యోగాలు లేక…… మళ్లీ పాతకథకు ఇది దారి తీస్తుందే తప్ప… ఏ మాత్రం ప్రయోజనం లేదు. ఒమిక్రాన్‌తో అయ్యేదేమీ లేదు.. చచ్చేదేమీ లేదు. జాగ్రత్తగా ఉండండి.. అప్రమత్తతో ఉండి పనులు చేసుకోండని ప్రచారం చేస్తే సరిపోతుంది. గత అనుభవాల దృష్ట్యా మరీ ప్రజలు అంత అజాగ్రత్తగా ఏం ఉండరు. వారంతా కోలుకోని విధంగా దెబ్బతిని ఉన్నారు. ఆ చేదు జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోయేవి కావు.