ఇదీ ఓ ఉద్యోగి బాధ‌. మ‌నోవేధ‌న‌. టీఆరెస్ అంటే అభిమానం. తెలంగాణ అంటే ప్రాణం. కేసీఆర్ అంటే వీరాభిమానం. ఎవ‌రెన్ని మాట‌ల‌న్నా.. కేసీఆర్ నిర్ణ‌యాల‌నెప్పుడూ ఆయ‌న త‌ప్పుబ‌ట్ట‌లేదు. ప్ర‌భుత్వం తీసుకునే ప్ర‌తి చ‌ర్య‌నూ స‌మ‌ర్థించాడాయ‌న‌. అవ‌స‌ర‌మైన సంద‌ర్బాల్లో కొంద‌రితో వాద‌న పెట్టుకున్నాడు. త‌ను అనుకున్న‌దే నిజ‌మ‌ని వాదించాడు. గెలిచాడు. నిలిచాడు. కానీ త‌న వ‌ర‌కు వ‌చ్చే స‌రికి.. ఉద్యోగుల విభ‌జ‌న ప్ర‌క్రియ‌లో ఓడిపోయాడు.

ఆ వేద‌న అర‌ణ్య రోధ‌న‌య్యింది. ఎవ‌రితో చెప్పుకోవాలో తెలియ‌దు. తెలిసి చేశారా..? తెలియ‌క చేశారా…? ఇప్పుడు స‌మ‌యం మించిపోయింది. జ‌ర‌గాల్సిన అన‌ర్థం జ‌రిగిపోయింది. లోక‌ల్ నాన్ లోక‌ల్‌గా మారారు. ఇక ఎప్ప‌టికీ త‌ను త‌న జిల్లాకు లోక‌ల్ కాలేన‌ని తెలిసిపోయిన త‌ర్వాత ఏం చేయాలో తెలియ‌క‌.. త‌న‌దైన శైలిలో నిర‌స‌న తెలిపాడా ఉద్య‌మ‌కారుడు, ఉద్యోగి, తెలంగాణ అభిమాని. త‌న ఫేస్‌బుక్ వాల్‌పై త‌న ఫోటో తీసేశాడు. బ్లాక్ రంగుతో నింపి నిర‌స‌న తెలిపాడు.

ఇది త‌న అస‌హ‌నం అని తెగేసి చెప్పాడు. ఇక తాను , త‌న పిల్ల‌లు త‌న జిల్లాకు ఎప్పుడూ లోక‌ల్ కాలేం… అని త‌నూ ఓ బాధితుడైనాని చెబుతూ.. చివ‌ర‌గా ఆ వైరాగ్యంలోనే జై తెలంగాణ అని నిన‌దించాడు. ఇది ఈ ఒక్క ఉద్యోగి ఆవేద‌నే కాదు.. ఇదో మ‌చ్చుకు ఉదాహ‌ర‌ణ‌. ఎవ‌రేమీ చేయ‌లేరు. కొంద‌రి గొంతులు లేవ‌వు. కొంద‌రివి లేస్తే.. వాటికి వ‌క్ర‌భాష్యాలు వ‌ల్లెవేసేందుకు మ‌న‌మే ఓ టీంను త‌యారు చేసిపెట్టుకున్నాం.

కొంద‌రు నిర‌స‌న ఇలా తెలిపితే.. అదిప్పుడు అర‌ణ్య రోధ‌న‌గానే మిగిలిపోతుంది. ప్ర‌భుత్వానికి మాత్రం ఏమీ ప‌ట్ట‌దు. చేసేది చేస్తుంది. ఇలా చేస్తూ పోతుంది. బాధ‌ప‌డేవాళ్ల క‌న్నీళ్లు ఇంకిపోతూనే ఉంటాయి. కొద్ది రోజులకు అవి మ‌రుపుకు వస్తాయి. కేసీఆర్ మీద అభిమానంతో ఆ బాధితులు కూడా బ‌హుశా మ‌రిచిపోతారేమో.. మ‌రిచిపోయే బాధైతే కాదు ఇది.

You missed