త్రిపుల్ ఆర్ సినిమా చారిత్రక ఘటనల ఆధారంగా తీశారు. కొమురం భీం, అల్లూరి సీతారామారాజు చరిత్రను కథగా తీసుకుని అల్లుకున్నారు. ఓ రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో… అని దాశరథి రాసినట్టు..ఇక్కడ వీళ్ల తెగులు హీరోయిజం కోసం.. కమర్శియల్ మసాల కోసం.. కోట్లను కొల్లగొట్టేందు కోసం.. ఈ చరిత్రను అష్టవంకరలు తిప్పి వక్రీకరించి దానికి ఫిక్షన్ అని సమర్థించుకుని.. వాళ్ల పేర్లను వాడేసుకుని .. అంతిమంగా ఆ క్రెడిబిలిటీ దర్శకుడికి, ఆ హీరోలకు , డబ్బులు నిర్మాతలకు వచ్చేలా ప్లాన్ చేశాడు మన జక్కన్న.
ఆయన మాటల్లోనే ఆ నిజాయితీ కనిపిస్తుంది. తను చేసిన తప్పును బాజాప్తా ఒప్పుకున్న తెలివైన మోసకారి ఈ రాజమౌళి అని మనం మొన్ననే చెప్పుకున్నాం కదా. తనే మాట్లాడుతూ.. మాములు హీరోలనే తను ఓ రేంజ్‌లో చూపడతాడట.. మరి అలాంటిది ఈ గ్రేట్ హీరోలను ఎంత సూపర్ లెవల్‌లో చూపెడ్తానో ఆలోచించండి అని చెప్పుకొచ్చాడు. అదీ.. సంగతి!! ఆ వీర హీరోలను సూపర్‌గా చూపించేందుకు నీకు చరిత్రే కావాల్సొచ్చిందా రాజమౌళి.. మరి చరిత్ర ఆధారంగా తీసినప్పుడు దాన్ని ఖూనీ చేయకుండా కూడా జాగ్రత్త పడాలె కదా. మధ్యలో ఫిక్షన్ పేరుతో నీ కల్పిత డ్రామా ఎవడికి కావాలె. ఆ పేర్లను ఎందుకు వాడుకున్నట్టు. నీ ఇష్టమొచ్చిన.. నీ మెదడు రచించిన ఈ కథలో చరిత్రనెందుకు వాడుకున్నావు..? అడిగేవాళ్లు లేరు. నువ్వుతీస్తావు.. మేము చూస్తాము. అంతే.
పెద్ద హీరోలను మోసేందుకు, వారిని మరీ లేపేందుకు చిన్న హీరోలను, టైమ్ అయిపోయిన హీరోలను బలిపెట్టడం సినీ ఇండస్ట్రీలో సహజమే కదా. మొన్న జగపతిబాబు, నిన్న శ్రీకాంత్.. హీరో బాలయ్య బాబుకు బలిపెట్టాడు దర్శకుడు బోయపాటి శ్రీను. సరే, మీ హీరోయిజం మీ ఇష్టం.. మీ ఖర్మ కానీ…. మధ్యలో కొమురం భీం ను ఎందుకు వాడుకున్నారనేదే ప్రశ్న. నిలదీత.