బాన్సువాడ అనగానే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి గుర్తొస్తాడు. ఆయనకు అక్కడ మంచి పేరుంది. కానీ అధికారపార్టీ నేతలు, ఓ మూడు పేపర్ల విలేకరుల కలిసి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టిన వైనం బయటకు పొక్కడంతో ఇప్పడంతా అది రచ్చ రచ్చ అయ్యింది. పెద్ద మనిషి ఇలాఖాలో భూ మాఫియా చెలరేగిపోవడంతో అధికారపార్టీకి ఇబ్బందికరంగా మారింది. గతంలో కూడా ఇక్కడ నుంచే ఇసుక మాఫియా చెలరేగిపోయిందనే విమర్శలున్నాయి.
ఇప్పుడు బాన్సువాడ పట్టణంలోనే కీలకమైన ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేటీషన్‌లు చేయించడం.. అది బయటకు పొక్కడంతో అధికారులపై వేటు వేసి ఈ తతంగాన్ని గంపకింద కమ్మేసే ప్రయత్నం చేశారు. నమస్తే తెలంగాణ, సాక్షి, ఈనాడు.. బాన్సువాడకు చెందిన ఈ మూడు పేపర్ల విలేకరులు తమ బినామీలను ముందు పెట్టి మరో ముగ్గురు అధికార పార్టీ నేతలతో కలిసి కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలున్నాయి.
ఈ ముగ్గురి విలేకరులపై హైదరాబాద్ కార్యాలయానికి ఈ విషయమై ఫిర్యాదులు కూడా వెళ్లాయి. నమస్తే తెలంగాణ విలేకరిని పక్కన బెట్టేశారు. ఈనాడు విలేకరిపై విచారణ కొనసాగుతున్నది. అధికార పార్టీ నేతలు మాత్రం బేఫికర్‌గా ఉన్నారు. తమకు పెద్దల అండదండలున్నాయని. పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ అయిన తర్వాత … అతని పెద్ద కుమారుడు భాస్కర్‌రెడ్డే ఎక్కువగా ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టాడు. తనకు తెలియకుండా ఇక్కడ ఏమీ జరగదనే ప్రచారం ఉంది.
ఇంత జరిగినా .. టీఆరెస్ పెద్దలకు సమాచారం లేకుండా ఉంటుందా..? అసలు దీని వెనుక సూత్రధారులెవరు..? ఆ ముగ్గరు టీఆరెస్ నేతలు ఎవరు..? వారి వెనుక ఉన్న హస్తాలెవరివి..? అధికారులను బలిపెట్టి.. తప్పించుకున్న అక్రమార్కులెంతమంది..? ఇప్పుడు బాన్సువాడలో ఇదే చర్చ జరుగుతున్నది. ఇంత జరిగినా …అధికార పార్టీ అధిష్టానం మాత్రం పట్టించుకోలేదు. అక్కడ పార్టీ పరువు పోయినా.. పోచారంపై ఉన్న మర్యాద, గౌరవంతో దీన్ని ఆయనకే వదిలేసినట్టున్నారు. కానీ టీఆరెస్ పార్టీ ఇలాంటి చర్యలతో మరింత పలుచన బడి, అక్కడ బీజేపీకో, కాంగ్రెస్‌కో ఊతమిచ్చేలా పరిస్థితులు మారుతున్నాయి.