రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే కాంగ్రెస్‌లో దూకుడు కనిపించింది. నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శిబిరంలో ఓ కొత్త ఉత్సాహం పెల్లుబుకింది. కాంగ్రెస్‌లో కొత్త ఆక్సిజన్ నింపింది. కానీ, ఇది మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. ఢిల్లీలో తనకు మద్దతుంది.. ఇక్కడేం చేసినా నడుస్తుందనుకున్నాడు. ఇది టీడీపీ లా ప్రాంతీయ పార్టీ అనుకున్నాడు. టీఆరెస్‌లో చేతులు కట్టుకుని ఉంటారనీ భ్రమపడ్డాడు. కానీ ఇక్కడంతా దేశముదుర్లు ఉంటారని వచ్చిన తర్వత గానీ తెలియలేదు రేవంత్‌కు.
ఒక జగ్గారెడ్డి, ఒక కోమటిరెడ్డి.. మరో రెడ్డి.. ఇంకో రెడ్డి.. ఇలా అందరినీ కలుపుకోవాలె. అంతే. వాళ్లు నీ దగ్గరకు రారు. వాళ్ల కాళ్ల దగ్గరకే నువ్వు పోవాలి. నటించాలి. నవ్వాలి. కడుపులో ఎంత విషమున్నా.. కోపమున్నా.. కనిపించకుండా కవర్ చెయ్యాలె. అవును నువ్వు తోపు అన్నట్టు లుక్కియ్యాలె. నాకు సహకరిచండి అని ఏడుపు ముఖం పెట్టి అర్థించాలె. అలా మెల్లగా వారికి దారిలోకి తెచ్చుకోవాలె. ఇప్పుడు రేవంత్ అదే పనిచేస్తున్నాడు. మొన్న మొన్న వచ్చి మా మీద నీ పెద్ద పెత్తనమేంది బై అని కోమటి రెడ్డి మొదటి నుంచి ఎదురుతిరుగతున్నాడు.
మొదట రేవంత్ పట్టించుకోలేదు. నాకు సోనియమ్మ ఆశీస్సులున్నాయి.. రాహుల్ అండదండలున్నాయి.. మీరెంత..? మీ లెక్కెంత ..? అనుకున్నాడు. కానీ కాళ్లల్లో కట్టెలు పెట్టి కిందపడేసే దాకా తెల్వలేదు ఈ దేశముదుర్లు ఎంతటి ఘనాపాటిలో. అందుకే రేవంత్‌కు తత్వం బోధపడ్డది. ఇలా కోమటిరెడ్డి దీక్షకు వచ్చాడు. కాళ్ల దగ్గర కూర్చుని కాళ్ల బేరానికి వచ్చాడు. మాజీ పీసీసీ కూడా తన అనుభవాన్నంతా ఇక్కడ చూపించి.. మనం మనం దోస్తులం.. చెట్టుకింద కోతులం అన్నట్టుగా కోమటిరెడ్డిని బుజ్జగించాడు. అసలు ఈ దీక్ష కోమటిరెడ్డి రైతుల కోసం చెయ్యలేదు. ఇగో రేవంత్ తన కాళ్ల దగ్గరకు రావాలని చేశాడన్నట్టుంది. మొత్తానికి కోమటిరెడ్డి అనుకున్నది సాధించాడు. అందుకే ఇలా ముసిముసిగా మురిసిపోయి.. వాళ్లతో కలిసిపోయి, చిన్న పిళ్లాడిలా కేరింతలు కొట్టి.. దీక్షా దక్షత అసలు ఉద్దేశ్యం నెరవేరిందనే సంతోషం కనబర్చి… చూశావా.. ఎవరు సినీయర్.. నువ్వా ..? నేనా..? ఎవరు గొప్పా.. .? పీసీసీ చీఫా..? నేనా..? అని ఓ లుక్కిచ్చాడు.