బ్రేకింగ్ న్యూసే మా ఛానెళ్లకు జీవం. వాటితోనే మనుగడ. అందరికన్నా ముందు మేమే ఉండాలి. మా తర్వాతే ఎవరైనా. సమాజాన్ని ఉద్దరించాలన్నా.. చంక నాకించాలన్నా.. మేమే. అన్నింటా మేమే ముందుండాలె. కరోనా వస్తుందని చెప్పినా మేమే. మెడికల్ మాఫియాకు జీవం పోయాలన్నా మేమే. అంతా మేమే. సెలబ్రిటీలు ఎవరు ఆస్పత్రిలో చేరినా… నిరంతరం అప్డేట్స్ ఇవ్వాలన్నా.. వాళ్లు ఎప్పుడు చనిపోతారో చెప్పాలన్నా మేమే. అందరికన్నా ముందు ఆ చనిపోయిన వార్త బ్రేకింగ్‌గా ఇచ్చేదీ మేమే. ఆ తర్వాత చచ్చిన వార్త నిజం కాదని తెలిసినా.. సిగ్గుపడకుండా ఇంకో చచ్చే బ్రేకింగ్ వార్త కోసం చచ్చీచెడీ పరుగులు తీసేదీ మేమే. మేమింతే. మాకు బ్రేకింగ్ కావాలి. దాని కోసం ఎవరినైనా చంపుతాం. ఎంతకైనా తెగిస్తాం. అందరికన్నా మేమే ముందుండాలంటే.. ఇలాంటి చచ్చు చావు వార్తల బ్రేకింగులు కోసం చచ్చే చావొచ్చి పడ్డా ఎక్కడా చావుకళ కనబడకుండా చచ్చిబతికి చనిపోయిన వార్తల కోసం రాబంధుల్లా ఆస్పత్రుల వద్ద పడిగాపులు కాసేదీ మేమే…