కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దును ఎవరూ నమ్మడం లేదని కేసీఆర్ కుండబద్దలు కొట్టాడు. మోడీ మాటలు ఎవరూ నమ్మడం లేదని, త్వరలో ఐదు రాష్ట్రాలకు జరిగే ఎన్నికల స్టంటే ఇదని మనసులో ఉన్నది చెప్పేశాడు. మోడీ రైతులకు క్షమాపణ చెప్పింది కూడా ఓ దళారీ పశ్చాత్తాపం కిందే చూడలన్నది ఆయన మాటల్లో పరమార్థంలా తోచింది.
కానీ ఇక్కడ గులాబీ నేతలు మాత్రం ధర్నా చౌక్‌లో కేసీఆర్ గర్జించగానే అక్కడ మోడీ కేసీఆర్ ఉద్యమ పటిమ ఎరిగి, జడిసి, వణికి వెంటనే మూడు నల్ల చట్టాలను రద్దు చేశాడని నానా యాగీ చేశాయి. నమస్తే తెలంగాణ ఆ వార్తలను కళ్లకద్దుకుని ఉన్నదున్నట్టు అచ్చేసింది. కానీ కేసీఆరే దీన్ని ఒప్పుకోలేదు. మోడీని నమ్మలేదు. ఇదంతా ఎన్నికల స్టంటేనన్నాడు. కానీ ఏదో మూల దీని క్రెడిట్ తనకు దగ్గాలనుకున్నట్టున్నాడు. ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు మూడు లక్షల చొప్పున పరిహారం అందించాలని డిసైడ్ అయ్యాడు. కేంద్రం మరో 25 లక్షలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.
తల్లికి అన్నం పెట్టనోడు… పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు ఇక్కడ రైతుల సమస్యలపై పరిష్కారం చూపనోళ్లు.. ధాన్యం కొనుగోళ్లు కాక వర్షార్పణం అయి ప్రాణాలు పోతుంటే..పట్టించుకోనుళ్లకు ఇప్పుడు ఉన్నపళంగా చనిపోయిన ఉత్తరాది రైతుల కుటుంబాలు ఎందుకు గుర్తొచ్చాయని సోషల్ మీడియాలో కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. 1200 మంది అమరుల కుటుంబాలకు కూడా పట్టించుకోండి అంటూ చురకలు పెట్టడం కూడా మొదలు పెట్టారు.