కేంద్రంతో కేసీఆర్ కయ్యానికి దువ్వాడు. మొన్నటి వరకు తెరవెనుకు దోస్తాన నడిచిన ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం అగాధం ఏర్పడింది. యాసంగి వడ్ల కొనుగోలు అంశం టీఆరెస్‌ను ఉద్యమానికి ఉసిగొల్పేలా చేసింది. ఉద్యమ సమయంలో రోడ్డెక్కిన కేసీఆర్.. సీఎం అయ్యాక ఏడేండ్ల తర్వాత మళ్లీ ధర్నా చౌక్ లోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. ఏ ధర్నా చౌక్ మీదైతే కత్తి గట్టాడో.. ఇప్పుడు అదే టీఆరెస్ మహాధర్నాకు వేదికైంది.మొత్తం ప్రభుత్వమంతా ధర్నా చౌక్‌కు దిగిరావడం, సీఎం అధ్యక్షతన ఈ ఆందోళన కొనసాగడం దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది.
కేసీఆర్ కూడా ఈ ధర్నాలో అదే రేంజ్‌లో మాట్లాడాడు. మాట్లాడిందంతా పాత సబ్జెక్టే. అటు తిప్పి ఇటు తిప్పి మా తప్పేం లేదు.. అంతా కేంద్రానిదే అదో దోషి అని రైతులకు చెప్పే ప్రయత్నమే చేశారు. చాలా విషయాల్లో క్లారిటీ మిస్సయ్యింది. కేసీఆర్‌కు స్పష్టత ఉన్నా… తన రాజకీయ అవసరాల కోసం వాటిని అలాగే అయోమయంలో ఉంచాడు. రైతులనూ అయోమయానికి గురిచేశాడు. యాసంగిలో వడ్లు కొంటవా..? కొనవా..? చెప్పమంటే చెప్పడం లేదని కేసీఆర్ అన్నాడు.
వాస్తవానికి కేంద్రం ఎప్పుడో చెప్పింది కొనమని. అందుకే కేసీఆర్ ఆ మధ్య వరి వేస్తే ఉరే అన్నాడు. వ్యవసాయాధికారులతో అవగాహన, శిక్షణ కార్యక్రమాలను కూడా పెట్టించి ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచనలు ఇప్పించాడు. బీజేపీ దీన్ని రాజకీయం చేసి టీఆరెస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు హుజురాబాద్ ఎన్నికలో బీజేపీ దూకుడుగా ప్రవర్తించి టీఆరెస్‌ను నిలువరించింది. సీఎం సభపెట్టుకోవడానికి కూడా అనుమతించలేదు. ఆ ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేకపోయాడు. ఈటల గెలుపు అస్సలు మింగుడుపడలేదు కేసీఆర్‌కు. అందుకే అప్పట్నుంచి బీజేపీపై ఒంటికాలిపై లేస్తూ వస్తున్నాడు.
ఈటల గెలుపు సంబరాల సంతోషం లేకుండా చేశాడు బీజేపీకి. సంజయ్‌ను తిట్టడం, టార్గెట్ చేయడం కూడా ఇందులో ఎత్తుగడగానే చెప్పుకుంటున్నాయి బీజేపీ, టీఆరెస్ శ్రేణులు.ఈ రోజు ప్రసంగంలో కొత్త విషయాలు ఏంటంటే.. చివరి రక్తపు బొట్టు వరకు రైతు సమస్యల కోసం కేంద్రంపై పోరాడతానని, భారత రైతాంగ సమస్యలపై కలిసి ఉద్యమ చేస్తానని, దీనికి టీఆరెస్సే నాయకత్వం వహిస్తుందని. ఈ మాటలు కూడా చాలా సార్లు చెప్పాడు కానీ, మరోసారి ఈ వేదికగా ఒ ప్రకటించాడు కేసీఆర్.
ఒకవేళ యాసంగిలో రైతులు వరి వేస్తే.. ఆ బియ్యాన్ని దిష్టి తీసి బీజేపీ ఆఫీసు మీద గుమ్మరిస్తామని ఓ శాపం కూడా పెట్టాడు లాస్టుకు. రైతులు మాత్రం తన మాట విని వరి వేయడం లేదన్నాడు. వరి వేయొద్దని పరోక్షంగా మళ్లీ రైతాంగాన్ని కోరుతున్నట్టుగా.