ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం.. రాజకీయాల్లో కొత్త చర్చకు తెర తీసింది. రోజుకో విధంగా రాజకీయాల మారుతున్నాయి. ఎప్పుడు ఏమవతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఎవ్వరూ ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. హుజురాబాద్ ఎన్నిక తర్వాత కేసీఆర్ రాజకీయాల మీద మరింత సీరియస్‌గా దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే కోటాలో ఎవరికి అవకాశం ఇవ్వాలో పది రోజుల ముందే లీకులు ఇచ్చారు. దీనికి పై నిన్నటి వరకు చర్చ జరుగుతూనే ఉంది.
కానీ అనూహ్యంగా రాత్రికి రాత్రి రెండు కొత్త పేర్లు వచ్చి పడ్డాయి. మాజీ కలెక్టర్ ను రాజీనామా చేయించి మరీ ఎమ్మెల్సీ ఇప్పించడం కేసీఆర్ మార్కుపాలనకు నిదర్శనం. రాజ్యసభ మెంబర్‌గా ఉన్న బండా ప్రకాశ్‌ను కూడా ఎమ్మెల్సీ చేసి మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు రంగం సిద్ధం అయ్యింది. లోకల్ బాడీ నుంచి నిజామాబాద్ నియోజకవర్గం నుంచి మళ్లీ కవితకే ఛాన్స్ ఇద్దామని అనుకున్నారు. కానీ ఆమె మొదటి నుంచి ఈ ఎమ్మెల్సీ అంటేనే అనాసక్తిగా ఉన్నది.
ఎంపీగా ఓడిపోయి ఆమె చాలా కాలం అజ్ఞాతంలో ఉండిపోయింది. ఆ తర్వాత రాజ్యసభ ఇస్తారని అంతా భావించారు. కానీ భూపతిరెడ్డి సస్పెండ్‌తో ఖాళీ అయిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ గా ఆమెకు అవకాశం ఇచ్చారు. ఏడాది పాటు ఆమె కొనసాగింది. ఇప్పుడు మళ్లీ నోటిఫికేషన్ పడింది. కానీ ఈసారి కూడా ఆమెకు ఇస్తారని అంతా అనుకున్న సమయంలో ఆశావహుల ఉత్సాహం మీద నీళ్లు కుమ్మరించినట్టయ్యింది. ఆకుల లలితకు ఎమ్మెల్యే కోటా కింద రెన్యూవల్ చేస్తారని చివరి వరకు ప్రచారం జరిగినా.. బండ ప్రకాశ్‌కు ఇచ్చి బీసీ సమీకరణలో లెక్క సరితూగేలా చేసుకున్నారు.
బండ ప్రకాశ్ రాజ్యసభకు రాజీనామా చేయనున్నాడు. డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావుది కూడా టర్మ్ మార్చితో పూర్తవుతుంది. రాజ్యసభకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో కవితకు అవకాశం ఇస్తే.. ఢిల్లీ లెవల్లో ఆమెకు సముచిత స్థానం, గౌరవం ఇచ్చినట్లవుతుందని అనుకుంటున్నారు. కవిత మనసులోనూ ఇదే ఉంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఇచ్చినా.. మంత్రి పదవి వచ్చేలా లేదు. అక్కడ రాజకీయ అవసరాల కోసం సమీకరణలు మారాయి. ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టాలంటే ముదిరాజ్ కులానికి చెందిన బండ ప్రకాశ్‌కు మంత్రి వర్గంలో చోటివ్వాలని కేసీఆర్ అనుకుంటున్నాడు. ఎల్ రమణకు కూడా కేబినెట్లో అవకాశం రావొచ్చంటున్నారు. మరి కవితకు ఎలా చాన్స్ ఉంటుంది..? అందుకే ఎమ్మెల్సీ తీసుకుని కూడా మంత్రి కాకపోతే..అదో అవమానంగా భావించే పరిస్థితి ఉంది.
ఇప్పటికే ఎమ్మెల్సీగా ఆమె కొనసాగినన్ని రోజులు ఇబ్బందికరంగానే గడిచాయి. ఇక మళ్లీ ఎమ్మెల్సీ తీసుకుని.. మంత్రిగా అవకాశం రాక.. ఇంకా రెండేండ్ల పాటు ఇలాగే కొనసాగాంటే ఆమెకు ఇబ్బందికరమే. అందుకే రాజ్యసభను ఆమె ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఇది ఇష్టం లేకున్నా.. ఆయన పై ఒత్తిడి ఉంది. ఇదే జరిగితే నిజామాబాద్ లోకల్ బాడీ స్థానం ఆశవాహుల్లో ఇంకా ఆశలు చిగురింపజేస్తుంది. ఎవరికి వారే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసుకోనున్నారు.