సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ కు రాజీనామా చేసి.. టీఆరెస్ పార్టీలో చేరుతున్నాడు. ఈయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కన్‌ఫాం చేశాడు కేసీఆర్. ఇదిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. కొత్త జిల్లాల పేరుతో చాలా మందికి కన్‌ఫర్డ్ ఐఏఎస్‌లుగా అవకాశం రావడం .. వారంతా కేసీఆర్‌కు విధేయులై పనిచేయడానికి ఎంతలా ఆరాటపడుతున్నారో సిద్దిపేట కలెక్టర్ ఉదంతం ఓ ఉదాహరణ.
సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి ఐఏఎస్‌ల విలువ కాళ్ల దగ్గరకు తెచ్చిపెట్టిన సదరు కలెక్టర్.. మొన్నటికి మొన్న కేసీఆర్ యాసంగిలో వరి వేయొద్దంటున్నాడని, అధికారులను, డీలర్లను పిలిచి ఓ వీధిరౌడీలా వార్నింగ్ ఇచ్చిన వీడియో సభ్య సమాజం చూసి ముక్కున వేలేసుకున్నది. అలా ఉన్నారిప్పుడు కలెక్టర్లు. సిద్దిపేట కలెక్టర్‌లా చాలా మందే ఉన్నారు మన రాష్ట్రంలో. అవకాశం కోసం చూస్తున్నారు. కేసీఆర్ ప్రాపకం కోసం పడిచస్తున్నారు. ఇలా అవకాశం వచ్చినప్పుడు రాజకీయ పదవులు అందుకునేందుకు కూడా రెడీగా ఉన్నారు. మరి తెలంగాణ తెచ్చుకుంది ఎందుకోసం…? ఇలాంటి అవకాశాల కోసమే కదా. రాని వారు ఏడుస్తారు. విమర్శిస్తారు. వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
సిద్దిపేట కలెక్టర్ ను పార్టీలో చేర్చుకుని కేసీఆర్ ఏం చెప్పాలనుకున్నాడు. ఎమ్మెల్సీగా ఇచ్చి ఏం సంకేతాలివ్వాలనుకుంటున్నాడు. తన కోసం పనిచేసే వారందరినీ ఇలా కడుపులో పెట్టి చూసుకుంటాడన్నమాట. తమ కుర్చీకున్న విలువను పాతరేసి కాళ్లు మొక్కినవారికి అందలమెక్కిస్తాడన్నమాట. కలెక్టర్లు కాదు మీరంతా.. పార్టీ కార్యకర్తలే అని మిగిలిన కలెక్టర్లకు ఓ సూచన చేస్తున్నాడన్నమాట. మీకు ముందంతా బంగారు భవిష్యత్తేనని ఓ ఆఫర్ ఇస్తున్నాడన్నమాట. ఇక కాస్కోండి కలెక్టర్లు.. సీఎం కనబడితే… మీ జిల్లాకు వస్తే కాళ్లు మొక్కే అవకాశాన్నిచేజార్చుకోకండి. ఆయన ఇచ్చిన పిలుపేదైనా మీరు రాజకీయ నాయకుల్లా పనిచేయండి…( అందరికీ ఇది వర్తించదు.. కొందరున్నారు కేసీఆర్ లిస్టులో)
అసలే టీఆరెస్‌లో ఎమ్మెల్సీ కోసం కొట్లాడుతుంటే.. కొత్తగా ఈ కలెక్టర్లు కూడా వారికి పోటీ రావడమేంది బై.. ఈ కేసీఆర్ ఏం చేస్తడో ఏమో.. ఎప్పుడు ఏం ఆలోచిస్తడో ఏమో.. ఎవరికీ తెలియదు. అందరినీ మచ్చిక చేసుకుంటాడు. ఇదంతా పాలనాపరమైన విధానంలో భాగమే అంటే ఎవ్వరూ నమ్మరు. విమర్శిస్తారు. అయినా.. విమర్శలు కేసీఆర్ పట్టించుకుంటాడా? మొన్న హుజురాబాద్‌లో ఓడితేనే లైట్ తీసుకున్నాడు.