ఎవరి రాజకీయాలు వారివి. వరి రైతు ఇప్పుడు ఇరు పార్టీలకు ఓ ముడి సరకు. రాజకీయ మైలేజీకి ఈ రెండు పార్టీలకు రైతు ఓ ఇంధనం. అధికార పార్టీ రేపు అన్ని నియోజకవర్గాల్లో, కలెక్టరేట్ల వద్ద ధర్నాకు దిగింది. యాసంగిలో బియ్యం తీసుకోవాలని. దీనికి కౌంటర్‌గా ఒకరోజు ముందు అంటే ఇవాళ అన్ని కలెక్టరేట్ల వద్ద బీజేపీ ధర్నాకు దిగింది. ఎందుకు..? ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన వడ్లు ప్రభుత్వ కొనడం లేదు. వెంటనే కొనాలని.
వారెవ్వా…! ఏం రాజకీయం బై మీది. ఈ వానాకాలం వడ్లు ప్రభుత్వం కొన్నా.. ఆ బియ్యాన్ని కొనేది ఎఫ్‌సీఐ.. అంటే కేంద్రమే కదా.. మరి మాకు రావాలె కదా మైలేజీ. కాబట్టి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి రైతుల పక్షాన నిలబడి కొట్లాది ధాన్యం మేమే కొనిపిచ్చినం అని రైతుల వద్ద మార్కులు కొట్టేయాలని అప్పటికప్పుడు ఆలోచించినట్టుంది బీజేపీ. అందుకే ఈ రోజు ఇలా ధర్నా చేసి టీఆరెస్ నేతలను ఇరకాటంలో పెట్టి నోరెళ్లబెట్టేలా చేసింది. రేపు టీఆరెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చోటా మోటా నేతలంతా ధర్నాలో పాల్గొని యాసంగిలో బియ్యం తీసుకోవాలని కేంద్రం పై ఒత్తిడి పెరిగేలా ధర్నాలు చేస్తారన్నమాట.
కానీ ఒక్కటే అర్థం కాని విషయం. ఇప్పుడు రైతులను యాసంగిలో వరి వద్దంటున్నారు. మరి కేంద్రాన్ని యాసంగి బియ్యం తీసుకోమని ఒత్తిడి తెచ్చేందుకు ధర్నా చేస్తున్నారు. ఎలాగూ కేంద్రం వినదు కాబట్టి.. వరి వద్దే వద్దని ముందుగానే రైతులకు చెప్పేశారన్నమాట. ఇది కేవలం వరి వద్దన్నది కేంద్ర విధానల వల్లేనని రైతులకు తెలియజెప్పేందుకు.. రైతులు దూరం కాకుండా ఉండేందుకు వారి మద్ధతును కూడగట్టుకుని అలా ధర్నా చేయడమన్నమాట.
అంటే.. కేంద్రం యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోనుగాక తీసుకోదు… అనుమానం లేదు…
ఈ యాసంగిలో రైతులు వరి వేస్తే మేం కొననే కొనమని ప్రభుత్వం డిసైడ్… ఇందులోనూ అనుమానం లేదు..
యాసంగిలో కేంద్రం బియ్యం తీసుకోదు.. తీసుకుంటుందని మేం చెప్పలేం.. మాటియ్యలేం అంటున్న బీజేపీ…. ఇందులోనూ క్లారిటీ వచ్చింది.
మరి ఈ రెండు పార్టీలు రైతులను అడ్డం పెట్టుకుని ధర్నాలు చేసి సాధించేదేమిటి..? రైతులకు ఒనగూరే లాభమేమిటి…?
ఏం లేదు…
రైతులను అడ్డం పెట్టుకుని మేం రైతులకు వ్యతిరేకం కాదు.. ఆ పార్టీ వ్యతిరేకం.. కాదు కాదు.. ఆ పార్టే వ్యతిరేకం మేం కాదు.. అని చెప్పడం కోసం ఇదో స్టంట్ .. ఓ డ్రామా….