అసలు సమస్య. వరి వేయాలా వద్దా..? వద్దన్నారు. కేంద్రం వద్దన్నదని చెప్పాడు కేసీఆర్. ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని ఇప్పటికే రైతులందరికీ చెప్పామన్నారు. కానీ ఇప్పటికీ రైతులకు ఇతర పంటలు ఏం వేసుకోవాలో సరైన అవగాహన లేదు. ప్రభుత్వం ఇన్సింటీవ్స్ ఇస్తామని కూడా ఏం ప్రకటించాలేదు. వీలైనంతగా వరి సాగును పూర్తిగా తగ్గించేయాలని ఈ యాసంగిలో అనేది కేసీఆర్ ఆలోచన. కానీ రైతుల నుంచి నేరుగా కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. అందుకే కేంద్రాన్ని దోషిలా నిలబెట్టాలని కేసీఆర్ రంగంలోకి దిగాడు.
మొన్నటి హుజురాబాద్ ఎన్నికలో టీఆరెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఈ తిక్క కేసీఆర్‌ను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. పైకి ఇదో లెక్కా..? ఓటమి, గెలుపు సహజమే అని మాట్లాడినా.. రెండు రోజులుగా పెట్టిన ప్రెస్ మీట్‌లో ఆయన సహనం మరిచి మితిమీరిన ఆగ్రహంతో మట్లాడిన తీరు దీన్ని పట్టిస్తుంది. అసలు బీజేపీ ఎక్కడుంది..? దాని బలమెంత.. ? అని తీసిపారేసిన కేసీఆర్.. అదే బండి సంజయ్ మాటలను మాత్రం బాగా పట్టించుకుంటున్నాడు.
మాటకు మాట జవాబిస్తున్నాడు. ప్రతీ తిట్టుకు కౌంటర్ ఇస్తున్నాడు. నాలిక చీరిస్తా.. ఆరు తుకుడలైతవు.. కొడుకా.. ఈ మాటలు కేసీఆర్ నోటి వెంట రావాల్సినవి కావు. సీఎం హోదాలో ఆయన హుందాగానే ఉండాలి. వాళ్లను కుక్కలంటూనే అదే స్థాయిలో కేసీఆర్ స్పందించడం ఎందుకు? టచ్ చేసి చూడు.. బతికి బట్ట కడతావా.? తాగుబోతంటావా?? నువ్వు మందు కలుపుతున్నావా? ఇదేనా సంస్కారం..? ఇవన్నీ మాటలను రిపీట్ చేయడం అవసరం లేదు. బండి సంజయ్‌కు ఏమీ తెల్వదు. ఓ జోకర్, బ్రోకర్ అంటూనే అతను అనే మాటలను ఎందుకు పట్టించుకోవాలి. మతతత్వ పార్టీ, కులం, మతం మీద రాజకీయాలు నడుస్తున్నాయి. అందుకే మనం ఇలా ఉన్నాం.. అని భారత రాజకీయాల గురించి మాట్లాడుతూ.. మాకు మతం లేదా.. మేం గుళ్లకు పోవడం లేదా.? మేం గుండ్లు కొట్టించుకోవడం లేదా..? అని మళ్లీ తమాయించుకున్నాడు. మతం పేరుతో మళ్లీ బీజేపీ ఎక్కడ రాజకీయం చేసి టీఆరెస్‌ను ఇరకాటంలో పెడుతుందనే భయం కావొచ్చు.
ఏ పంట వేయాలో తెలియక తలపట్టుకున్న రైతన్నను రోడ్డు మీదకు తెస్తున్నాడు కేసీఆర్. ఈ శుక్రవారం నుంచి అన్నినియోజకవర్గాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారట. యాసంగి సీజన్ ఆరంభమైంది.వరి వద్దంటున్నారు. అది కాకుండా వేరే పంటలు వేసే అలవాటు లేదు. వాతావరణం లేదు. సరిపడా మెకానిజం లేదు. ప్రభుత్వ ప్రోత్సాహం లేదు. కానీ ఇవేమీ ఈ రెండు పార్టీలు పట్టించుకునే పరిస్థితుల్లో లేవు. నీది తప్పంటే నీది అని ఒకరి మీద ఒకరు నెపం వేసుకుని రాజకీయం చేసుకునే పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఇక రోజూ ప్రెస్‌మీట్ పెడతాడట కేసీఆర్. అదీ గంటల పాటు ముచ్చటించినట్టుగా. దీనికి కౌంటర్‌గా బీజేపీ కూడా పెడుతుంది ప్రెస్‌మీట్.. మాదితప్పు కాదు.. నీదే నీదే నీదే అని.
రైతులు మాత్రం నెత్తికి చేతులుపెట్టుకుని చూస్తున్నారు. వరి వేయాలా వద్దా..?
వేసేద్దామా? వేసేద్దాం.. ఏమన్నా కానీ.. వీళ్ల గొడవలతో మాకేం సంబంధం..? ఇంతకు మించి దారేం లేదు..
కొనకపోతే చూద్దాం..వరి వేసుడే.. ఆ తర్వాత వీళ్ల సంగతి చూసుడే.
అదీ సంగతి.