హుజూరాబాద్‌లో ఈటల గెలుపు పై ఒక్క ఆంధ్రజ్యోతి మాత్రమే విభిన్న, విస్తృత కథనాలిచ్చింది. ఉన్నదున్నట్టు చెప్పింది. వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి వార్తలన్నీ. మిగిలిన పత్రికలేవీ ఆవైపు ఆలోచన చేసేందుకే జంకినట్టున్నాయి. ఈటల గెలుపును మాత్రమే తీసుకుని అవే హెడ్డింగులతో సరిపెట్టాయి. అధికార టీఆరెస్ పార్టీ విఫలమైన తీరు.. దుబారా ఖర్చు.. లోపాలు, వైఫల్యం గురించి రాసేందుకు భయపడ్డాయి.
నమస్తే తెలంగాణది వీటిలో మొత్తానికి భిన్నం. ఇతర రాష్ట్రాల్లో నిన్న వచ్చిన ఫలితాల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందనే వార్తనే ప్రధాన శీర్షికన వేసుకున్నది. హమ్మయ్య బతికిపోయాం అని అనుకున్నట్టున్నది. ఆ వార్త దొరికింది కాబట్టి సరిపోయింది.. లేకుంటే ఈటల రాజేందర్ గెలుపు వార్త మెయిన్ మొదటి పేజీలో పెద్దగా వేసుకోవాల్సి వచ్చేదని అనుకున్నదేమో..! అయినా మన పిచ్చిగానీ, ఈటల గెలుపు వార్త రాయకుండా కూడా వదిలేయగల సాహసం చేయగలదు నమస్తే. ఎవరైనా వచ్చి అడుగుతారా? పెద్దగా ఇస్తేనే అడుగుతారు. ఉద్యోగం ఊడుతుంది. కేసీఆర్‌కు కోపం తెప్పించే ఇలాంటి పనులు చేసేందుకు ఆ ఎడిటర్‌కు ఎంత ధైర్యం ఉండాలి. అక్కడ అంత సీన్ లేదు. చిన్న స్టాంప్ సైజ్ బాక్సులో ఈటల వార్త వేసి .. మీకు ఇదే ఎక్కువ అని సరిపెట్టారు. పాపం.. గెల్లు గెలిస్తే ఏ టైటిల్ పెట్టాలి. సీఎంకేసీఆర్ బొమ్మ హాఫ్ పేజీ ఎలా కుమ్మేయాలి. హరీశ్ గురించి ఎంతలా కీర్తించాలి… అన్ని ప్లాన్ చేసి పెట్టుకుని ఉంటారు. అలా జరగకపోయే సరికి కోపంతో.. ఇలా సరిపెట్టారు.
ఈనాడు కూడా ఈటలకే జీ హుజూర్ అని పాత చింతకాయ పచ్చడి హెడ్డింగ్ ఒకటి పెట్టి వదిలేసింది. ఇంతకు మించి మేం రాయలేం అని సరిపెట్టేసింది. టీఆరెస్ ప్రస్తావనే లేదు. సాక్షి అస్త్రాలనీ విఫలం అని కనిపించీ కనిపించనట్టు టీఆరెస్ గురించి రాసి.. ఇంతకన్నా దైర్యం చేసే సాహసం మాకు లేదని చేతులెత్తేసింది.హుజూరాబాద్ షా ఈటలే.. అని హెడ్డింగ్ పెట్టి.. ఆ విజయం తాలూకు వార్తతో ముగించేసింది. ఎట్లాగూ నమస్తే తెలంగాణ ఈ వార్తకు ప్రయారిటీ ఇవ్వదని తెలుసు గనుక.. ఆంధ్రజ్యోతి.. నమస్తే ఈటల అని పెట్టుకున్నాడు. టీఆరెస్, సీఎం కేసీఆర్‌పై వివిధ కోణాల్లో కథనాలిచ్చాడు. కేసీఆర్‌కు ఘోర పరాభవం అని రాసి ఆ దమ్ము మాకు మాత్రమే ఉందని తేల్చింది.