హుజురాబాద్… ఈ రోజు, రేపు ఓపిక పడితే ఓ తంతు ముగుస్తుంది. ఈ రెండ్రోజులు జర ఊపిరిబిగపట్టండి. ఓట్లు పడంగానే ఓ పనైపోతుంది. మళ్లీ ఫలితాల కోసం మరో ఉత్కంఠ. సరే రెండు తారీఖు దాక ఓపిక పట్టండి. ఎవరి భవిష్యత్తు ఏందో..? ఎవరి పక్షాన ప్రజలున్నారో..? ఎవరెంత మభ్యపెట్టారో..? ఎవరెంత మచ్చిక చేసుకున్నారో..? దండలెవరికో.. దండనెవరికో.. తేలిపోతుంది. సరే, గానీ ఇక్కడా దుబ్బాక ఫలితమైనే రిపీట్ కాదు కదా. ఓ వెయ్యో రెండు వేల ఓట్లతోనో బీజేపీ గెలిస్తే..? ఎన్ని ఓట్లని కాదు గెలుపు గెలుపే కదా.
అదే జరిగితే. అమ్మో ఇంకా ఏమన్నా ఉందా..? కేసీఆర్ ఇజ్జత్ పోతది.హరీశ్ శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతది. దేవుడా..! ఇలా మాత్రం జరగొద్దు. ఇంత కష్టపడ్డదానికి టీఆరెస్‌నే గెలిపించు. ఇన్నిన్ని పథకాలు, ఇంతింత అభివృద్ధి బీజేపీతోని అవుతదా? అవునూ ఈటల గెలిచి సాధించేదేముందబ్బా..? ఊకే కేసీఆర్ మీద రాళ్లేసుడు తప్ప. మనకు ఏం చేసినా కేసీఆర్ చేస్తడు. కొంచెం లేటవుతుండొచ్చు.. కొన్ని అబద్దాలుండొచ్చు. కొన్ని అమలేకాకపోవచ్చు. కానీ అంతో ఇంతో మేలైతే టీఆరెస్‌తోనే జరుగుతుంది. బీజేపీతో ఒరిగేదీ లేదు.. వచ్చేదీ లేదు.
అవునూ.. ఇన్నిన్ని పైసలు తీస్కోని కూడా టీఆరెస్‌ను ఓడగొడ్తారా అక్కడి ఓటర్లు..? ఇదే జరిగితే వాళ్లంత విశ్వాసఘాతకులు, నయవంచకులు, నీచులు, నికృష్టులు….. ఇంకెవరూ ఉండరు. నమ్మకం ఉంది. హరీశ్ ప్రయత్నాలు వృథా పోవు. కేసీఆర్ దగ్గర మంచి మార్కులే పడతాయి. దుబ్బాక పోతే పోయింది.. కానీ హుజురాబాద్ మాత్రం పోవద్దన్నాడు కేసీఆర్. అందుకే ఇంతలా కష్టపడ్డాడు హరీశ్. పండుగలేదు.. పబ్బం లేదు.. ప్లీనరీ లేదు.. గ్లీనరీ లేదు… అంతా హుజురాబాదే. ఇంతలా తనెన్నడూ కష్టపడలేదు. ఇంతగా కష్టపడ్డందుకైనా ..దేవుడా… హుజురాబాద్‌లో టీఆరెస్‌నే గెలిపించు… ప్లీజ్..!