కలెక్టర్లు, మంత్రులు.. ఎవరూ తగ్గడం లేదు. ఎవరి పరిధిలో వారు రెచ్చిపోతున్నారు. నోటికెంతొస్తే అంత. ఏమనాలనిపిస్తే అది.. అలా నోరు జారి పెంట పెంట చేసుకుంటున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని బద్నాం చేసుకుంటున్నారు. ఆఖరికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఇదే కోవలోకి చేరాడు. ఆయన పలుమార్లు తనదైన శైలిలో మాట్లాడి విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఊర్లో రచ్చబండ మీద కూర్చుని పంచాయితీలు తెంపిన చందంగా.. అందరినీ అదలించి బెదిరించిన మాదిరిగా వీళ్లు ప్రెస్ మీట్లలో కూడా అదే దురుసుతనంతో మాట్లాడి నవ్వులపాలవుతూ ఉంటారు.
తాజాగా నిరంజన్ రెడ్డి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలను మంగళవారం మరదలు అని అనేశాడు. ఇది నోరుజారడం కాదు. ఉద్దేశ్య పూర్వకంగా వెటకారం పాలు ఎక్కువుంటుందనే అన్నాడు. కానీ ఆ మాట తను అనవచ్చా..? అంటే ప్రజలు ఏ విధంగా తీసుకుంటారనే కనీస సోయి కూడా మరిచాడు మన నీళ్ల మంత్రి. ప్రతీ మంగళవారం ఆమె నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తానని చెప్పడంతో మంత్రి గారికి చుర్రుమన్నది. దీక్ష చేస్తే చెయ్యని.. తమరు అలా మరీ దిగజారి మరుదలు అనే మాట మాట్లాడాలా…? మంత్రి గారు. మీ వెటకార మాటలకు బలయ్యేది మీరు.. మీ ప్రభుత్వమే. ఇంత సోయి లేకుండా మాట్లాడి మీ నోటి దురుసును, అహంకారాన్ని ప్రదర్శించుకోవడమే తప్ప.. దీని వల్ల ఏమన్నా ఉపయోగముంటుందా…? .
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ మధ్య.. ఓ మహిళా అధికారిని బాగానే ఊపుతున్నావ్ అన్నాడు. ఓ మీటింగు సాక్షిగా అన్నాడు. దొరల మాటలు ఇలా అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయన్న మాట. ఎంత అణుచుకుందామన్నా.. ఇలా బయటపడిపోతూ ఉంటాయి. ఆఖరికి మన కలెక్టర్లు కూడా ఏమీ తీసిపోవడం లేదు. సీఎం కాళ్ల మీద పడిపోయి పొర్లు దండాలు పెడుతూ ఆ సీటుకే వన్నె తెస్తున్నారు. ఇంకా సరిపోదంటూ… మీటుంగులలో సీఎం ఇలా చెప్పాడో లేదు.. బట్టలు చింపుకుని వీధిరౌడీల్లా, గల్లీ లీడర్లలా బెదిరింపులతో అధికారులకు అల్టిమేటం ఇస్తున్నారు. సీఎం మెచ్చుకోవాలె. అంతే.