ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కొత్త ప్రచారాలు పుట్టుకొస్తాయి. కొత్త వార్తలు చక్కర్లు కొడతాయి. చివరి నిమిషంలో ఏదో ఒక వార్త ఓ పార్టీని మేలు చేస్తుంది. ఓ పార్టీ పుట్టి ముంచుతుంది. మామూలుగా హుజురాబాద్ లాంటి ఉప ఎన్నికల్లో ఇలాంటివి లాస్ట్ మినట్లో పుట్టుకొస్తాయి. ఓటర్లను అయోమయంలో ఉంచి ఓట్లు కొల్లగొట్టే ఎత్తుగడలో ఇవి సాగుతాయి.
ఇప్పుడు అందరి దృష్టి హుజురాబాద్ ఉప ఎన్నికపై పడింది. మరో ఐదు రోజులు మాత్రం గడువుంది ఎన్నికకు. ఈలోగా కొత్త ప్రచారాలు, ఫేక్ వార్తలు కామాన్. మనం చూస్తూండాలి అంతే. పెద్దగా ఆశ్చర్యపడొద్దు. తాజాగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో ఈటల గెలిస్తే సీఎం అవుతాడని జోస్యంచెప్పాడు. హుజురాబాద్‌లో ఈటల గెలవాలనే ఆకాంక్ష తప్ప.. సీఎం అవుతాడనే దాంట్లో ఎటువైపు నుంచి చూసినా.. ఏ కోశానా నమ్మబుద్ది కావడం లేదు జాజులా. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నావు.. బాగనే ఉంది. కానీ ఈసీఎం అవుతాడనే మాట లాజికల్‌గా ఆలోచిస్తే ఎక్కడా ఒక్కశాతం కూడా అవుతాడనే నమ్మకమైతే కుదరలేదు.
టీఆరెస్‌లో ఉన్నప్పుడు సీఎం సీటు కోసం కేసీఆర్‌కే వెన్నుపోటు పొడిచేందుకు చూశాడనే ఆరోపణలు అందరూ చేశారు. ఇది కూడా నవ్వు తెప్పించే ఆరోపణలే. ఎందుకంటే.. సీఎం కేసీఆర్‌ను గద్దె దించి .. సీఎం అయ్యేంత సీన్ అక్కడ ఉందా? అసలు ఈటలకు ఇలాంటి ఆలోచన వస్తుందా? పార్టీ పుట్టుక నుంచీ ఉన్నాడు. సీఎం మనస్తత్వం ఎరిగినోడు.. పాలన దగ్గరుండి చూసినోడు.. అవమానాలు ఎదుర్కొన్నోడు.. అన్నీ భరించినోడు.. తెలిసినోడు.. పోయి పోయి సీఎం సీటుకు ఎసరు పెడతాడా? ఏదో అలా అపవాదు వేసి మంత్రి పదవి ఊడగొట్టాలి. పార్టీ నుంచి మెడలు పట్టి నూకెయ్యాలి.. అనే ఆలోచనలో భాగంగానే ఇవన్నీ ఆరోపణలు గానీ.
సరే ఇది పోనీ గానీ.. ఈ సీఎం అవుతాడనే ప్రచారం వెనుక.. అది కాదు పోదు కానీ కనీసం ఇలాంటి హైప్ క్రియేట్ చేస్తేనైనా గెలుపు ఈజీగా ఉంటుందనే భావన కావొచ్చు బహుశా. నిజామాబాద్ అర్బన్ ఉప ఎన్నిక సమయంలో కూడా డీఎస్ అప్పుడు తనను గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతాయనే ప్రచారం చేసుకున్నాడు. గెలవలేదు. యెండల లక్ష్మీ నారాయణ గెలిచాడు. కేసీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల ఈ ఎమ్మెల్యేను గెలిపించండి.. పెద్ద పదవి ఇస్తా.. పెద్దపదవి వరిస్తుంది.. అంటూ ఆశలు రేపి వెళ్లేవాడు.
అలాగైనా ఓటర్లు గెలిపిస్తారనే ఆశతో. ఇగో ఇలాంటి ఆశలే కావొచ్చు జాజుల శ్రీనివాస్‌వి. ఈ ఎన్నిక తర్వాత పార్టీ వీడుతాడని టీఆరెస్ ప్రచారం చేస్తున్నది. బీజేపీలో ఈటలకు సీఎం అయ్యే సీనుందా..? మరి కాంగ్రెస్‌లో సీఎం సీటు ఇస్తారా? టీఆరెస్‌లోకి మళ్లీ వచ్చి సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా మిగిలి ఉన్నాయా?? ఈ ప్రశ్నలే నవ్వు తెప్పించేలా ఉన్నాయి. ఈటల సీఎం అనే మాట కడుపుబ్బా నవ్వు తెప్పించేలా ఉన్నది. కాదంటారా?
http://dhunt.in/ny64F?s=a&uu=0x33b74cd336f2793b&ss=wsp