కాంగ్రెస్‌లో ఘర్ వాపసీ ఎపిసోడ్ నడుస్తోంది. కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీలకు వెళ్లినవారిని, ఎటూ కాకుండా ఉన్నవారిని, అసంతృప్తులను మళ్లీ కాంగ్రెస్ గూటికి తెచ్చేందుకు రేవంత్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది ఆయనకు పీసీసీ చీఫ్ ఇవ్వగానే మొదలైంది. మొదట్లో కొంత దూకుడు కనిపించింది. తర్వాత ఆయన పార్టీపై తన ముద్రను వేసుకునేందుకే ఎక్కువ ప్రాధన్యతనిచ్చాడు.
అయితే ఈ రోజు రాజ్యసభ సభ్యుడు, సీనియర్ లీడర్ డీఎస్‌ను రేవంత్‌రెడ్డి ఆయన నివాసంలో కలిశాడు. ఇటీవల ఇంట్లో కాలుజారి పడటంతో ఆయన చేతికి గాయమైంది. కొన్ని రోజులుగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ రోజు రేవంత్ వెళ్లి కలిసి ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు. ఆరోగ్యంపై ఆరా తీశాడు. ఘర్‌వాపసీలో భాగంగా డీఎస్‌ను మళ్లీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించే పనిలో ఎప్పుడో పడ్డాడు రేవంత్‌రెడ్డి. ఇటీవల పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. పెద్ద కొడుకు సంజయ్ కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఆయన కూడా రేవంత్‌ను కలిసి తను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించాడు.
మరో ఆరు నెలల్లో డీఎస్ రాజ్యసభకు పదవీకాలం ముగుస్తుంది. దీనికి మూడు నెలల ముందే డీఎస్ రాజకీయంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు. టీఆరెస్‌కు దూరంగా ఉంటున్నాడు. బీజేపీనుంచి అర్వింద్‌ను గెలిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డాడు. అంతా డీఎస్ ఇక బీజేపీ గూటికి పోతారని భావించారు. కానీ డీఎస్ మనసంతా కాంగ్రెస్ వైపే ఉంది. పెద్ద కొడుకు సంజయ్‌కు మళ్లీ రాజకీయ భవిష్యత్తు కావాలంటే కాంగ్రెస్సే సరైన వేదిక అని డీఎస్ భావిస్తున్నాడు.
చిన్న కొడుకు అర్వింద్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్నాడు. పెద్ద కొడుకు రాజకీయ భవిష్యత్తే అగమ్యగోచరంగా ఉంది. ఇప్పుడు ఇదే రంది డీఎస్‌లో ఉంది. అందుకే మళ్లీ కాంగ్రెస్ పెద్దలతో ఆయన టచ్‌లో ఉంటూ వస్తున్నాడు. రేవంత్ రెడ్డి సైతం డీఎస్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చేందుకు దౌత్యం వహిస్తున్నాడు. ముహూర్తం కోసం వీరిద్దరూ చూస్తున్నారు.