సినిమా చూస్తున్నంతసేపూ నిజంగా మందల్ల మ్యాకలెంబడి.. గొర్లెంబడి తిరిగినట్టనిపించింది.
తెలుగు సినీ చరిత్రలోనే ఇప్పటివరకు టర్ర్‌రే.. గెగ్గె.. చ్యూ.. దొయ్ అనే పదాలు వినలేదు. కొండపొలం సినిమా మొత్తం ఇవే పదాలు.. పలకరింపులు వినిపిస్తాయి. కనిపిస్తాయి.
భుజాన గొంగడి.. చేతిలో దుడ్డుగర్ర.. నెత్తికి రుమాలు.. కాళ్లకు తోలుచెప్పులు.. గోశి అన్నీ మస్తు కుదిరినయి.
సినిమాలో చెప్పినట్లు నిజంగానే గొర్లకాపరులు ఏనెల పొంటి.. దోనెల పొంటి రోజుల తరబడి ఉంటరు. బత్తెం దీస్కొచ్చే నాటికి తినడానికింత రొట్టెనో.. అన్నమో దొర్కుతుందని కాకుండా సూడటానికి తనవాళ్లు వస్తున్నారనే సంతోషం మాటల్లో చెప్పలేనంతగా ఉంటది.
రవిప్రకాశ్ క్యారెక్టరే దీనికి నిదర్శనం.
తన భార్య సుభద్ర బత్తెం తీస్కొని.. కొడుకును తోల్కొని వస్తుందేమో అని మొదటి బత్తానికే గంపడాశ పెట్టుకుంటడు. భార్యకు ఇష్టమైన అంగీ వేసుకొని ఆశగా వస్తడు. అందరూ కనిపిస్తరు గానీ తన భార్య సుభద్ర కనిపించదు. నిరాశతో.. రెండో బత్యానికైనా వస్తదిలే అని కొండపొలానికి వెళ్తడు.
రెండో బత్యం యాల్లయింది. అదే ఆశ.. అదే ఉత్సాహం. మళ్లీ నిరాశే. సుభద్ర రాలేదు. చాలా బాధపడతడు. ఎండనక.. వాననక.. తిండనక.. తిప్పలనక.. చెట్టూ పుట్ట ఎంబడి తిరుగుతూ.. జీవనాధారమైన గొర్లను మేపులకు కొట్టుకపోతే.. తనను చూడనీకె.. తనకు బత్యం తీస్కరానీకె భార్య రాకపోవడుతోటి లోలోపల ఏడుస్తడు.
తన బాధను ఆపుకోలేక.. హోటల్ దగ్గరున్న కాయిన్ బాక్స్ నుంచి సుభద్రకు ఫోన్‌కాల్ చేసి..
“ఔను సుభద్రా.. నేను ఎర్రోనమ్మే. గొర్రెలూ.. గొర్రెపిల్లలూ తప్ప లోకం తెలియని ఎర్రోన్ని. అందుకే పదో తరగతి సదూకున్నె నిన్ను పెండ్లిజేసుకొన్నెది. నువ్వు నాకు లోకం సూపిశ్చావనే” అని ఏడుస్తూ చెప్తడు.
తన చెల్లెలి పెండ్లికి రాలేదనీ.. పండుగకు రాలేదని అలిగిన సుభద్రను సముదాయిస్తూ.. “నాగ్గూడా అనిపించింది. నీతోపాటు పెండ్లికి రావాల్సుందే. మీ సిన్నాయిన కూతురు పెండ్లి.. నీకు సెల్లెలు. మొగునితో రాలేదని నలుగురితో నగుబాటే. కానీ నేనేంచేయను సుభద్రా. కరువొచ్చి తిండి లేక జీవాలు సచ్చూరుకుంటాయమ్మీ”.. అని చెప్తూ గొర్లకాపరుల జీవితం లోకానికి సంబంధం లేకుండా ఎట్లా ఉంటుందో చెప్పి కంటతడి పెడతడు.
ఇప్పటికీ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్ పొంటి ఎన్నో గొర్ల గుంపులు కనిపిస్తయి. ఇవన్నీ కొండపొలం లెక్కనే. ఏడనో ఓ కాడ పొయ్యి పెట్టి ఇంత వండుకొని ఇంటికాన్నుంచి తెచ్చుకున్న మామిడికాయ తొక్కు.. చింతకాయ తొక్కు తినుకుంట నెలల తరబడి గడిపి.. వంతులు తీర్సుకునేందుకు కొందరు ఇంటికివొయ్యి వచ్చేటోళ్లు బియ్యం.. బత్యెం తీస్కొని వస్తుంటరు.
… “ఏయ్.. ఎవుర్రా”.. అని అడవిలో ఎర్రచందనం చెట్లను నరికి కలపను అక్రమంగా తీస్కపోయే బ్యాచ్ తారసపడి అడిగితే అందరూ ఒక్కసారిగా “గొల్లొల్లం” అని చెప్తరు. “మేం గొల్లొల్లం” అనే చెప్పే మాటల్లో కొంత అమాయకత్వం.. కొంత ధైర్యం కనిపిస్తయి.
కానీ.. ధైర్యం చేస్తే ఎట్లావుంటదో నర్సింహస్వామి పేరు చెప్పి గుట్టల్లో జీవాలను మేపినందుకు పుల్లెర వసూలు చేసేవాళ్లొచ్చినప్పుడు కనిపిస్తది. “పులితోనే కొట్లాడి నిలబడ్డోల్లం మీరో లెక్కకాదు” అని ఒడిసెలతో రాయి రువ్వి పుల్లెర కోసం వచ్చినోల్లను పంపిస్తరు.
గొర్లతో.. మందతో వారికున్న మమకారం సినిమాలో స్పష్టంగా కనిపిస్తది. ఏ గొర్రెకైనా సుస్తిజేస్తే వాళ్ల పానమెట్లా తల్లడిల్లుతదో జాల గొర్రెపిల్లకు సుస్తిచేసిన సీన్లో చూడొచ్చు.
“యో..”
“ఏమబ్బా..”
“అదో.. ఆ జాలగొర్రె వుంది సూడూ.. పొద్దు బారెడుండంగా సూసినా. గడ్డినోట కొరికింటే ఒట్టురా.. పట్టుకొని రవ్వంత సూడండ్రా.”
“నిజమే అబ్బీ మెత్తగుంది”.. అని ఏ ఆకు పసరో పెట్టి నయంజేస్తరు.
గొర్లమందలకు నక్కలు.. తోడేళ్లే శత్రువులు కాదు. సినిమాల్లో పెద్దపులిని చూపిస్తరు. కాకపోతే నల్లమల లాంటి దట్టమైన అడవుల్లో మాత్రమే పులుల భయం ఉంటది. మామూలు మందల్లో అయితే ఎక్కువగా తోడేళ్ల భయం. వీటితో పాటు అప్పుడయినా.. ఇప్పుడయినా దొంగల బెడద ఎక్కువ.
అట్లనే ఒకసారి కొండపొలంపై దొంగలు దాడిచేస్తరు.
“ఏమైందిరా గొర్లు బెదురతాండాయి.?”
“దొంగల్ దొంగల్రోయ్..”
“ఒరేయ్.. మందకు ఆపక్కనున్నోళ్లు ఈ పక్కకు రాండీ.. ఎవన్నీ పోనీగాకండీ. పుచ్చె పగలాల ఒక్కొక్కనికి”.. అంటూ కలిసికట్టుగా దొంగల్ని తరిమేస్తరు.
వాళ్లను పట్టుకుందామని రవి అంటే.. గురయ్య వద్దని వారిస్తడు. “మనం కొండల పొంటి.. గుట్టల పొంటి జీవాలను మేపుకుంట తిరిగేటోళ్లం.. వాళ్లేమే తాడూ బొంగరం లేనోళ్లు. మన మందలపై దాడిచేస్తే వాళ్లను తరిమేయాలెగానీ.. వాళ్లతోటి వైరం పెట్టుకోవద్దురా.. పగపడ్తరు.” అని గురయ్య సర్దిచెప్పే తీరు బాగుంది.
ఇక.. పెద్దపులి దాడిచేసినప్పుడు చెట్టుకొకరు.. పుట్టకొకరు అయ్యి జీవాలకు తాగుదామంటే నీళ్లు లేని పరిస్థితి ఏర్పడుతది. రెండ్రోజులైనా సుక్క నీళ్లు దొర్కలే. “ఎట్లరా దేవుడా” అని ఏడుస్తుండంగా ప్రకృతి కరుణించి వాన పడ్డప్పుడు గురయ్య వాన పరవశ్యానికి గురై.. మట్టినీ.. వాన నీటినీ దోసిళ్లకు తీసుకొని ముఖానికి పూసుకునే తీరు మట్టితో బతికేవాడికి వాన ఎంత ముఖ్యమో గుర్తుచేస్తది.
ఫైనల్‌గా ఏ అడివిలో అయితే గొర్లమందల్లో అయితే తిరిగిండో రవి.. అక్కడే తన ఫెయిల్యూర్ స్టోరీని సక్సెస్ స్టోరీగా మలుచుకొని కొండపొలం గుండెబలంతో ఆ అడివికే అధికారిగా అపాయింట్ అయ్యి అడవి ప్రాముఖ్యతను.. చెట్టు విలువను.. జీవాలపై ప్రేమను.. కులవృత్తిని.. సంస్కృతిని తెలియజేసిండు. ఒక విషయం ఏందంటే.. గొల్లొల్ల ఇండ్లల్లో ఆడవాళ్లు ముక్కుపుల్ల పెట్టుకోరు. ఓబులమ్మ ముక్కుపుల్లతో కనిపిస్తది.
సినిమా: బాగుంది.
Daayi Sreeshailam