కొత్త సినిమా. కొత్త హీరో. అప్ప‌టికే మంచి క‌థ‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. కానీ కొండ‌పొలం సినిమా రిలీజ్‌కు మాత్రం అంత హైప్ రాలేదు. ముందే క‌థ గురించి తెలిసిపోయి ఉంటుంది. ఇది ఓ న‌వ‌ల ఆధారంగా తీసిన సినిమా అని తెలుసుకుని ఉంటారు. ఇది గొల్ల‌ల క‌థ అని కూడా అర్థ‌మ‌యి ఉంటుంది. క‌థంతా గొర్ల చుట్టూ తిప్పార‌నీ గ్ర‌హించి ఉంటారు. ఈ సోది కథ‌లు మ‌న‌క‌వ‌స‌ర‌మా అని కూడా అనుకొని ఉంటారు. అందుకే కొత్త సినిమా అయినా మొద‌టి రోజే స‌గం సీట్లు ఖాళీగానే ద‌ర్శ‌న‌మిచ్చారు. ప్రేక్ష‌కుల‌కు ఎందుకో క‌థ క‌నెక్ట్ కాలేద‌నిపిస్తుంది. ఈ క‌థ‌ను డైజెస్ట్ చేసుకోలేద‌నిపిస్తుంది.

పాపం.. త‌ప్పువాళ్ల‌ది కాదు. వాళ్ల‌ను ఇసుమంతైన త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. తెలుగు సినిమా క‌థ‌లు ఎలా ఉండాలో మ‌న‌మే వారికి నేర్పాం. క‌థ‌ల మూస ఎంపిక‌తో వాని మ‌న‌స్సుల‌ను మ‌లినం చేసిపాడేశాం. హీరోకు అతీత‌శ‌క్తులు ఆపాదించి..హీరోయిజం అంటే ఇలాగుండాల‌ని నిర్వ‌చ‌నాల‌నూ మ‌న‌మే ఇచ్చినం. హీరోయిన్ అంటే అంద‌చందాల‌న్నీ ఆర‌బోసి క‌నువిందు చేయాల‌నే ప్రాథ‌మిక సూత్రాన్నీ మ‌న‌మే పాటిస్తూ వ‌చ్చినం. పంచ్ డైలాగుల‌కు అల‌వాటు చేసినం. తొడ‌లు చ‌రిచి, స‌మోలు గాల్లోకి ఎగిరి, ర‌క్త‌పాతం ఏరులై పారి.. ఇవ‌న్నీ కంటికి ఇంపుగా ,స‌మ్మ‌గా ఉండే విధంగా మ‌న‌మే క‌దా అల‌వాటు చేశాం. ఇలా ఉండాలి తెలుగు సినిమా అని ఓ రేంజ్‌ను మ‌న‌కు మ‌న‌మే క‌దా క్రియేట్ చేసి వ‌దిలాం. ఇప్పుడు కొత్త క‌థ‌లు, ప్ర‌యోగాలు అంటూ ఏదో తీసి ఇవి కూడా చూడండి.. అని పాపం వారి మీద‌కు నూకిస్తే.. ఇది స‌మంజ‌స‌మా..? ఈ ప్ర‌యోగాలు వారికి అవ‌స‌ర‌మా? వారి నాడి తెలిసీ, వారి కోరిక‌లు ఎరిగి ఇలాంటి సినిమాలు వ‌ద‌ల‌డం ఏమ‌న్నా భావ్య‌మా..? అందులో క‌థ‌లే లేన‌ట్టు.. అందులో ఓ న‌వ‌ల ఆధారంగా. ఇంకా దారుణం హీరో గొర్రెలు కాయ‌డం.. ఛీ ఛీ ఇంత‌క‌న్నా మా మెగాహీరోకు అవ‌మానం ఏమ‌న్నా ఉంటుందా?

మేం ఏ విధంగా క‌టౌట్ల‌కు దండ‌లు వేయాలి. అప్పడెప్పుడో కృష్ణ బ‌ట్ట‌లుతికాడ‌ని, చాక‌లి ప‌ని చేశాడంటూ ఎంత నామ‌ర్థాగా ఫీల‌య్యాం. ఇలా హీరోల‌ను ప్ర‌యోగాల పేరుతో చీప్ చేయ‌కండి ప్లీజ్‌. తెలుగు హీరో అంటే ఇస్త్రీ అంగీ న‌ల‌గ‌కుండా .. డ‌జ‌న్ మందిని ఒంటి చేత్తో అలా మ‌ట్టిక‌రిపించాలి.. అది మేం కోరుకునేది. ఇద్ద‌రు ముగ్గురు హీరోయిన్ల‌ల‌తో స‌య్యాటలు ఆడాలి. డ‌బ‌ల్ మీనింగ్ డైలాగులు అవ‌లీల‌గొ కొట్టాలి. కత్తి ప‌ట్టాలి. కండ కండాలుగా ఖండించాలి. తొడ‌లు చ‌రిచి మీసం తిప్పాలి. ఇవ‌న్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే మాకానందం. మీకు డ‌బ్బులు. ఇలా కొండపొలం.. గొర్లుకాయ‌డం తీసుడు మానండి..తెలుగు సినిమా ఇజ్జ‌త్ తీయ‌కండి ప్లీజ్‌. మ‌న సినిమాను ఎక్క‌డికో తీసుకుపోతార‌ని మేం అనుకుంటాం… కానీ మీరు మాత్రం ఇలా అడ‌విలో గొర్లు కాస్తూ కొండ‌పొలం చేస్తూ ఉంటారు. అక్క‌డికి పోరు. మీరు మార‌రు. అంతే..

You missed