సిన్నోడా ఏం ఉద్యోగం చేస్తావేందీ..?
కంప్యూటర్ ఉద్యోగం..
అదేం ఉద్యోగం..?
నీకు చెబితే అర్థం కాదులే..
అంటే అర్ధం కాని ఉద్యోగం చేస్తావా..?
ఇప్పుడు సదువుకున్నోళ్లంతా ఇసొంటి అర్థం కాని ఉద్యోగాల కోసమే పరుగులు పెడుతుర్రు..
నేను సదువుకుని ఉంటే మాత్రం పాణమున్న ఉద్యోగం చేసేదాన్ని.. అడవి భాషను నేర్చుకుని.. మనుషులకు నేర్పేదాన్ని….
కొండపొలం సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య సాగే సంభాషణ ఇది. సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రాసిన నవల కొండపొలం.. ఆధారంగా క్రిష్ జాగర్లముడి తెరకెక్కించిన సినిమా. గొల్లల కులవృత్తి ఆధారంగా సాగిన కథనం. పిరికివాడైన వైష్ణవ్ తేజ్ డిగ్రీ చదివి ఉద్యోగం కోసం ఇంటర్వ్వూలో తడబడి, భయపడి నాన్నతో పాటు కొండపొలం పోయి గొర్లను మేపాలని నిర్ణయించుకుంటాడు. ఓ 40 రోజుల పాటు అడివిలో జరిగే కథ ఆసక్తి కరంగా తీశాడు డైరెక్టర్. కొద్ది సాగతీతలా కథ నడుస్తున్న సమయంలో వెంటనే ఓ మలుపు ను తీసుకుని ఉత్కంఠగా తెరకెక్కించాడు. ఆసాంతం అడివి అందాలు కనువిందు చేస్తాయి. కామెడీ కథలో భాగంగా కొంచెమే ఉన్న నవ్విస్తుంది. కంట తడి పెట్టించే సీన్లు అక్కడక్కడా తళుక్కుమనిపిస్తాయి. హీరో నటనలో ఓనమాలే నేర్చుకుంటున్నా.. ఎంచుకున్న కథ అతన్ని హీరోనే చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర.. రంగస్థలంలో సమంత పాత్రను గుర్తు చేసింది. రాయలసీమ మాండలికం బాగా కుదిరింది. పాటలు గుర్తుంచుకునేలా లేకున్నా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పెద్దనక్క (పెద్దపులి) సీన్స్‌లో గ్రాఫిక్స్ పేలవంగా ఉంది. అంతకన్నా బాగా తీయొచ్చు. అడవిలో రాటుదేలి, ఇన్ఫిరియారిటీని పోగొట్టుకుని, ధైర్యంతో పులిని సంహరించిన హీరో.. అదే ఉత్సాహంతో సివిల్స్‌కు ప్రిపేరై ఐఎఫ్ఎస్గా సెలెక్ట్ అయ్యి.. అదే ఊరికి డీఎఫ్‌వోగా రావడంతో కథ ముగుస్తుంది. హీరో, హీరోయిన్ ప్రేమాయణం , విడిపోవడం.. అంత కనెక్ట్ కాలేదు. చివరకు హీరో అధికారికిగా వచ్చి ప్రాణమున్న ఉద్యోగం వచ్చింది అని హీరోయిన్ చెప్పడం .. బాగుంది. అడవిలోనే సంసారం చేయాలని చేస్తావా అని అడిగే డైలాగులు కథలో కలిసిపోయాయి.
అవును.. ఇది ప్రాణమున్న సినిమా..