హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగే వరకు ఇంకెన్ని వింతలు చూడాలో.. ఇంకెన్ని ఘోరాలు చూసి తట్టుకోవాలో. దేన్నీ వదలడం లేదు. ఫేక్ న్యూస్‌లో మీరు షేర్ అంటే.. మేం సవ్వాషేర్ అంటున్నారు. నువ్వు అట్ల పెట్టి మమ్మల్ని బద్నాం చేస్తవా..? చూడు నిన్నెట్ల బజారుకీడుస్తమో..? అనే విధంగా పోటీలు పడి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ గుప్పిస్తున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. కంపు కంపు చేసుకుంటున్నారు.
ఇప్పుడు బతుకమ్మ వంతు వచ్చింది. దొరికింది మోఖా అనుకున్నారు. ఏదో పాత పాట వీడియోను తీసుకుని కేసీఆర్ మీద ఓ పాట కట్టింది దీనికి ఆపాదించారు. ఫామ్ హౌజ్‌లో పన్న సీఎం అనే అర్థం వచ్చేలా ఉన్న పాట ను పెట్టి మహిళలు ఈ విధంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా పాటలు పడుతున్నారని కామెంట్లు పెట్టి ఈ ఆడియో మార్ఫింగ్ వీడియోను వైరల్ చేశారు. మేమేం తక్కువ తిన్నామా అని కేంద్రం లోపాలు, పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా పెరగాయో ఓ పాట కైగట్టి అదే పాటకు దీన్ని జతకట్టి వదిలారు.
ఓహో .. మీరంతకు తెగిస్తారా…? ఇగో చూడు.. అంటూ .. నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి మీద వీరో పాటను తీసుకొచ్చి అదే పాత బతుకమ్మ పాటకు జోడించి మళ్లీ సోషల్ మీడియాలో వదిలారు. ఈ పోటీలు పడి బతుకమ్మ పాటలను కూనీ చేసి.. పార్టీలు తమ కసినంతా తీర్చుకుంటున్నాయి. పొద్దున్నుంచి ఈ ఫేక్ న్యూస్.. మార్ఫింగ్ వీడియోల తంతు విజయవంతంగా కొనసాగుతుంది. చూసిన వాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఆఖరికి బతుకమ్మ పాటలను కూడా వదల్లర్రా.. థూ. మీ బతుకులు చెడ.. అని తిట్టుకుంటున్నారు. తిట్టుకుంటే మాకేందీ..? మేం చేసేది చేస్తామంటున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు.