ఆయన మంత్రి. సీఎం తనయుడు. కానీ రాంగ్ రూట్‌లో వచ్చాడు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఎస్సై ఐలయ్య ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. మంత్రి గింత్రీ జాన్తా నై అన్నాడు. సీఎం కొడుకైతే రూల్స్ పట్టవా? అని అనుకున్నాడు. చలాన్ గుంజిండు. కేటీఆర్‌కు ఇచ్చిండు. సీతయ్య ఎవరి మాట వినడు.. అన్నట్టుగా ఈ ఐలయ్య.. ఎవరినీ చూడడు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఎంతటి వారికైనా చలాన్ గుంజుతడు. ఇక్కడా అదే చేశాడు.
అతని సిన్సియర్ డ్యూటీకి అందరూ అబ్బురపడ్డారు. శభాష్ ఐలయ్య.. నీలెక్కనే ఉండాలె. అప్పుడే అందరికీ రూల్స్ అంటే భయం ఉంటదని మెచ్చుకున్నారు. అందరూ మెచ్చుకున్నట్టే.. చలాన్ పడ్డ మన మంత్రీ కూడా భేష్ అన్నాడు. భుజం తట్టాడు. మీలాంటోళ్లకు మేం అంటాం బ్రదర్ అని అభయమిచ్చాడు. ప్రశంసించాడు. ఎవరితే నాకేంటీ? అనే రేంజ్‌లో డ్యూటీ చేసిన ఐలయ్య ఇప్పుడు హీరో అయ్యిండు. తనకు చలాన్ వేసినందుకు అతని మెచ్చుకుని కొనియాడిన మన మంత్రీ మెప్పుకోలందుకున్నాడు.
అవ్.. మంత్రంటే ఇట్లుండాలె.. భై. నేను మంత్రిని, సీఎం కొడుకుని.. నాకే చలాన్ వేస్తవా..? చూస్కుంటా.. అనే టైప్ క్యారెక్టర్ తనది కాదని చెప్పాడు అందరికీ. చోటా మోటా లీడర్లే.. పార్టీల పేరు చెప్పుకుని, కండువాలు కార్లకు అద్దం ముందు పెట్టుకుని, మేం ప్రత్యేకం.. మాకు నిబంధనలు వర్తించవు.. రూల్స్ గీల్స్ జాన్తానై అంటూ పోలీసులను బెదిరించుకుంటూ.. వారితో కయ్యాలకు దిగుతున్న రోజులివి. ఇగో ఇలాంటివి జరిగితే అసొంటోళ్లకు బుద్దొస్తది. పోలీసులకు ధైర్యం వస్తది.