గ్రామ పంచాయతీలు నిధులు లేక విలవిలలాడుతున్నాయి. ఈ రోజు గ్రామ పంచాయతీ సంబంధించిన నిధుల పై అసెంబ్లీలో చర్చ కొనసాగింది. వాస్తవ పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి.
600లోపు జనాభా ఉన్న పంచాయతీలకు ప్రభుత్వం విడుదల చేసే నిధులు సరిపోవడం లేదు. పర్ క్యాపిటా వంద రూపాయల చొప్పన ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఈ అరకొర నిధులు కరెంటు బిల్లులు, జీతాలకే సరిపోవడం లేదు. దీంతో ప్రభుత్వం ఏడాది క్రితం అన్ని పంచాయతీలకు తీసుకున్న కొత్త ట్రాక్టర్ల ఈఎంఐలకు నిధులు సరిపోక ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రతి మూడు నెలలకొసారి ఈ కిస్తీలు కట్టాల్సి ఉంది. కానీ అవి కట్టే సమయానికి జీపీలలో నిధులు ఉండడం లేదు. కలెక్టర్‌ను అడిగి పల్లెప్రగతి నిధుల నుంచి ట్రాక్టర్లకు ఈఎంఐలను కడుతున్నారు. ఏడాదిగా ఇదే తంతు నడుస్తున్నది. అన్ని చిన్న గ్రామ పంచాయతీల్లోనూ ఈ నిధుల గండం వెక్కిరిస్తున్నది. పర్ క్యాపిటా రూ. 100 నుంచి రూ. 150 పెంచితే తప్ప నిధుల లేమి బాధ నుంచి విముక్తి దొరకదనే అభిప్రాయం వినిపిస్తున్నది.
మరోవైపు చాలా చోట్ల సర్పంచులు గుత్తేదారుల అవతారం ఎత్తారు. వచ్చిన పనులు వచ్చినట్లుగా చేసి పెట్టారు. అప్పులు తెచ్చి మిత్తీలు కడుతున్నారే తప్ప బిల్లులు మాత్రం రావడం లేదు. కొంత మంది బలవన్మరణం పొందుతుండగా.. నిజామాబాద్ జిల్లాలో ఆరెపల్లి సర్పంచ్ రాత్రి వేళల్లో సెక్యూరిటీ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అసెంబ్లీలో సీతక్క అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పై ప్రత్యేక చర్చ పెట్టాలని కూడా స్పీకర్‌ను కోరాడు. నిజంగా ఇప్పుడు వీటిపై చర్చ అవసరమే.