” బాబు నీకు హెవీ షుగర్ ఉంది… ఇంత వరకు నీవు పరీక్షలు చేయించుకోలేదు కాబట్టి నీకు తెలియలేదు. నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఇప్పటికే నీ బాడీపై ప్రభావం పడింది. కిడ్నీలపై అపుడే ఎఫెక్ట్ మొదలైంది”
చెప్తూ పోతున్నాడు డాక్టర్ క్యాజువల్ గా.
రాజారెడ్డికి కళ్లు బైర్లు కమ్మినట్లనిపించింది. పక్కలో బాంబు పడినట్లుగా అదిరిపడ్డాడు. పక్కనే ఉన్న వనజ ముఖం పాలిపోయి ఉంది. ఆందోళన పెరిగింది. “ఇపుడెలా డాక్టర్ ?” అన్నది భయంగా. ” ఏముందమ్మా? షుగర్ ముందులు వాడాలి. హెవీ
డోస్ రాస్తున్నా. దీనికీ కంట్రోల్ కాకపోతో ఇన్సులెన్ దాకా పోతుంది. కేర్ తీసుకోకపోతే డయాలసిస్ తప్పదు” అన్నాడు.
డాక్టర్ కు ఇలా చెప్పడం కామన్ అయినట్లుంది. సాధారణంగానే చెప్తూ వెళ్లిపోతున్నాడు. కానీ వాళ్లిద్దరూ మాత్రం తెరుకోలేకపోతున్నారు. ” రేపు డిశ్చార్జి చేయండి ” అని నర్సుకు చెప్పి ముందు బెడ్ వద్దకు వెళ్లాడు డాక్టర్. వనజకు కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించింది. అంతలోనే దబ్ మని అక్కడే నేలపై పడిపోయిందామె.
కళ్లు తిరిగి కిందపడిన వనజను పైకి లేపారు హాస్పిటల్ స్టాఫ్. పక్కనే కుర్చీపై కూర్చోబెట్టారు. రాజారెడ్డి భార్య వైపు ఆందోళనగా చూస్తూ కనిపించాడు. ఆ తర్వాత భార్య వైపు చూడలేక ముఖం తిప్పుకున్నాడు. బెడ్ పై అటు తిరిగి పడుకున్నాడు. దుఃఖం ఆగడం లేదు. ఎగదన్నుకుంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకు ప్రయత్నం చేస్తున్నా తన వల్ల కావడం లేదు. మెత్తకు ముఖం అద్దుకుని బయటకు కనిపించకుండా కుళ్లి కుళ్లి ఏడుస్తున్నాడు రాజారెడ్డి. కొద్ది సేపటికి తేరుకున్నాడు. భార్య వనజ కూర్చున్నవైపు చూశాడు.
అక్కడ వనజ లేదు. రాజారెడ్డి ఫోన్ రింగవుతున్నది. ‘హై న్యూస్’ రాజేశ్ ఫోన్ చేస్తున్నాడు.
చార్జింగ్ తీసి సెల్ ఫోన్ అందుకున్నాడు. ‘హలో’ నీరసంగా ఉంది గొంతు. తన మాట తనకే వినిపించనంత బలహీనంగా. “రాజన్నా …. ఇపుడెట్లుంది?” అవతలి నుంచి రాజేశ్ అడుగుతున్నాడు.
“………
“అన్నా ఎక్కడున్నవ్…? ఇంటి దగ్గరేనా? “ మళ్లీ అడిగాడు రాజేశ్. “లేదు…. గవర్నమెంట్ దవఖానలో….” కూడబలుక్కుని అన్నాడు రాజారెడ్డి. ” ఏందీ సర్కార్ దవఖానలనా? అంథ్లెందుకున్నవన్నా?” అన్నాడు. ఆందోళన నిండిన స్వరంతో. “ నిన్న వచ్చి అడ్మిట్ అయిన.. రేపు డిశ్చార్జి చేస్తరట.” అన్నాడు. ఫోన్ పెట్టేస్తే బాగుండు మనసులో అనుకున్నాడు రాజారెడ్డి. “ పక్కనే కరోనా వార్డు ఉంది కద అన్నా… ” అన్నాడు. “అవును” “మొన్నటి దాక నీనండ్లనే ఉన్న”
రాజేశ్ కు కరోనా వచ్చింది. మొదట ఇంట్లనే ఉండి ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. కానీ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే హాస్పిటల్ లో చేరాడు. ఇక్కడే అతని భార్య నర్సుగా పనిచేస్తున్నది.
” అదో నరకం అన్నా.. . నేను అనుభవించిన.. ” అన్నాడు రాజేశ్.
” నా భార్య నర్సుగా ఉన్నా.. నాకు అందులో తిప్పలు తప్పలేదు. ఇంకా ఏమి దిక్కులేనోళ్ళ సంగతి ఏమి చెప్పాలి?”
” కోవిడ్ ఇంజక్షన్ ఇయ్యమంటే అయిపోయాయన్నరన్న. బయటకెళ్లి 40వేలు ఖర్చు పెట్టి తెప్పించుకున్న” అన్నాడు ఆవేదనగా.
” ఆక్సిజన్ అడిగినా పెట్టరు. వాళ్ళకిష్టమొచ్చినప్పుడే పెడతారు… పట్టించుకోరు.. పేదోళ్ల గోస వర్ణనాతీతం రాజన్నా!”
“వాళ్లతో వీళ్లతో ఫోన్లు కూడా చేయించిన.. అయినా తియ్యగా మాట్లాడుతరు. ఆ తర్వాత అంతే. చేసేది చేస్తరు” అన్నాడు రాజేష్. “ఆ దవాఖాన సూపరింటెండెంట్ రతిమ ఉంది కదా.. అదో పెద్ద దొంగది అన్న.
దానికి అక్కడే ‘దివి’ అనే ఓ ప్రైవేటు హాస్పిటల్ ఉంది. ఇక్కడ పేషెంట్ల భయపడేలా చేసి అక్కడికి రిఫర్ చేస్తది” చెప్తూ పోతున్నాడు.
“ రెండు మూడు రోజులకు లక్షలు గుంజుతున్నరే… అడిగేవాళ్లేరి. దండుకోవడానికి ఇదే సమయం వీళ్లకు.” అన్నాడు కోపంగా మళ్లీ.
” నేను వారం రోజులు ఆడ నరకం అనుభవించి బతుకు జీవుడా..! అని బయటపడ్డా” అన్నాడు రాజేశ్.
“అన్నా ఆ ‘నిర్మల’ హాస్పిటల్ లో కూడా ఇదే విధంగా దోపిడీ ఉందన్న. మొన్నటి దాక బంద్ చేసుకున్న రామేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా కోవిడ్ కోసమే తెరుచుకున్నాడన్నా. కోట్లు దోచుకున్నడు ప్రజలదగ్గర ఇప్పటి వరకు. ” అన్నాడు.
గణేశ్ టీ మెంట్ తీసుకున్నది అక్కడే. గుర్తుకొచ్చింది రాజారెడ్డికి. ” అన్నా.. నీవు ఆడ ఎక్కవ సేపుండకు. కరోనా అంటుకుంటది” అని భయపెట్టాడు రాజేశ్. అప్పటికే గుండెనిండా దిగులుతో రగిలిపోతున్న రాజారెడ్డికి ఆ చివరి మాటలు ఉలిక్కిపడేలా చేశాయి. “వామ్మో నాకు కరోనా వస్తే ఇంకేమన్నా ఉందా? ఇక్కడ ఒక్కక్షణం ఉండొద్దు.” అని మనసులో అనుకున్నాడు. ” సరే రాజేశ్, డాక్టర్ వస్తున్నాడు నేను మళ్లా మాట్లాడతా” అని ఫోన్ పెట్టేశాడు. అబద్దం చెప్పాడు రాజేష్ కు. వెంటనే ఏదో స్పురించిన వాడిలా………. ఫోన్ కలిపాడు. ” శ్రీధర్ అర్జంటుగా హాస్పిటల్ కు రా..” అవతలి నుంచి ఏదో అడిగేలోపే ఫోన్ డిస్ కనెక్ట్ చేశాడు రాజారెడ్డి. పది నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాడు శ్రీధర్. శ్రీధరను చూడగానే రాజారెడ్డికి ప్రాణం లేచొచ్చినట్లనిపించింది.
” ఇక్కడ్నుంచి మనం అర్జంటుగా బయటపడాలి” అన్నాడు. హడావుడిగా అక్కడున్న తన వస్తవులన్నీ ఓ బ్యాగులో పెట్టుకుంటూ.
శ్రీధరకు అర్థం కావడం లేదు. నిశ్చేష్టుడైన చూస్తున్నాడు. శ్రీధర్ చేతిపట్టుకొని బరబరా గుంజుకొచ్చాడు బయటకు. బైక్ స్టాండ్ వద్దకు వచ్చారిద్దరు. అన్యమనస్కంగానే బైక్ ను తీసి స్టార్ట్ చేశాడు శ్రీధర్. ఎండ చుర్రుమనిపిస్తుంది.

మాడు పగులుతుందా అన్నట్టు మంటగా ఉంది రాజారెడ్డికి.
చేతిలో బ్యాగును నెత్తికి పైన అడ్డుగా పెట్టుకున్నాడు. ” ఏమైంది రెడ్డీ?” ఏం జరిగిందో తెలియక అయోమయంగా అడిగాడు శ్రీధర్. జరిగిందంతా చెప్పాడు రాజారెడ్డి. ఇంటి వద్దకు వచ్చారు. భార్య వనజ రాజారెడ్డిని చూసి షాక్ తిన్నది. ఉన్నపళంగా ఇంటికి వచ్చినందుకు. రాజారెడ్డి ఆమె ఫీలింగను పట్టించుకోలేదు. లోపలికి వెళ్లి బ్యాగ్ ను మూలకు విసిరాడు. బెడ్ పై బొక్కబోర్లా పడ్డాడు. శ్రీధర్ బైక్ స్టార్ట్ చేసి అక్కడ్నుంచి జారుకున్నాడు. వనజకు ఏమీ అర్థంకాక లోపలికొచ్చింది. “ఏమైంది డాక్టర్ పంపించేశాడా?”
“………
“రేపు కదా డిశ్చార్జి?”
“…….
మందులు తీసుకొని వచ్చావా?
……..
” మాట్లాడవే? బెల్లం కొట్టిన రాయిలా పడిపోయావ్?”
“ చేసిందంతా చేసి… ఇపుడు మాకిదేం టార్చర్?”
” నీతోని మేము ఎప్పుడు సుఖ పడ్డాము కనుక?”
అప్పటి వరకు చప్పుడు చేయని రాజారెడ్డి. చివరగా వనజ మాట్లాడిన మాటకు తోక తొక్కిన తాచు లా తల ఇటు వైపు తిప్పి కొరకరా చూశాడు. ఆ చూపులు వనజను కొరికేయాలన్నట్లుగా ఉన్నాయి. మీద పడి రక్కేయాలన్నంత కోపంగా కనిపిస్తున్నాయి.
అప్పుడే జేబులో ఫోన్ రింగయ్యింది. ఎవరు చేస్తున్నారో కూడా చూడలేదు. దాన్ని తీసి మూలకు విసిరేశాడు.
*****

(ఇంకా ఉంది)

You missed