డీఎస్. ధర్మపురి శ్రీనివాస్. రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్న నేత. కాంగ్రెస్‌లో బహుకాలం పనిచేసి సీఎం సీటును అధిష్టించే దాకా వెళ్లి వచ్చినోడు. ఇందూరు రాజకీయాల నుంచి ఎదిగినవాడు. విశ్వాసపాత్రుడు, నమ్మినబంటుగా పేరు తెచ్చుకున్నవాడు. ఢిల్లీ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని పదిలపర్చుకున్నవాడు. ఇదంతా నాణానికి ఒకవైపు. మొన్నటి వరకు. ఇపుడు డీఎస్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా కాంట్రాస్ట్‌గా మారిపోయింది. కొంతకాలంగా డీఎస్ అజ్ఞాతంలో ఉన్నాడు. బయటకు రావడం లేదు. అతని వ్యూహాలు, ఆలోచనలు నాలుగు గోడలకు మాత్రం పరిమితమయ్యారు. కలిసే నేతలు, అభిమానులు కూడా పరిమిత స్థాయిలోనే ఉన్నారు. ఇప్పుడు ఈ కెరటం లేచి పడిపోయింది. ఎప్పుడు లేస్తుందో తెలియదు. కెరటమే కదా.. లేస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు అంటారా…? అయితే దానికి మరో మూడు నెలలు బాకీ ఉంది. ఈ మూడు నెలలేందీ? ఆ తర్వాత ఏమవుతుంది? ఏం చేయబోతున్నాడు డీఎస్..?
ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఇది చదవండి.
ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంతో అలిగి కేసీఆర్ మాటలను నమ్మి తల్లి లాంటి పార్టీని వీడాడు డీఎస్. మొదట ప్రభుత్వ సలహాదారుగా, ఆ తర్వాత కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రాజ్యసభ సభ్యుడిగా చేశాడు. కానీ డీఎస్ ఇంకా ఏదో కోరుకున్నాడు కేసీఆర్ నుంచి. తనకు సరైన ప్రాధన్యత ఇవ్వడం లేదనే విషయాన్ని తొందరలోనే తెలుసుకున్నాడు. ఇది కాంగ్రెస్ కాదు.. ప్రాంతీయ పార్టీ టీఆరెస్. ఇందులో కేసీఆర్ చెప్పింది వినాలి తప్ప.. మనమేమీ చెప్పేదుండదని తెలుసుకోవడానికి పెద్ద సమయమేమీ పట్టలేదు. ఆ లోపు .. ఈ ఇద్దరి మధ్య ఉన్న అంతంత మాత్రం సంబంధాలకు అర్వింద్ గండి కొట్టాడు.
బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అయ్యాడు. దీనిపై కేసీఆర్ భగ్గుమన్నాడు. తన కూతురు స్థానం నుంచి డీఎస్ కొడుకు పోటీ చేయడమేందీ అని ఓ ధశలో డీఎస్‌ను అవమానించే స్థాయిలోనే మాట్లాడాడు. డీఎస్ ఆత్మాభిమానం దెబ్బతిన్నది. కొడుకు వినేలా లేడు. కేసీఆర్ అర్థం చేసుకోడు. ఎటు వైపు నిలవాలి? అనే సందిగ్థంలో ఆయన కొడుకు వైపు మొగ్గు చూపేందుకే సిద్ధమయ్యాడు. ఎంపీగా కొడుకును గెలిపించుకునేందుకు నాలుగు గోడల మధ్య కూర్చోనే చక్రం తిప్పాడు. మున్నూరుకాపులను ఏకం చేశాడు. తన పరిచయాలను, అనుభవాన్ని మొత్తం అర్వింద్ గెలుపు కోసం ఉపయోగించాడు. అనుకున్నది సాధించాడు. కేసీఆర్ బిడ్డను ఓడగొట్టి ప్రతీకారం తీర్చుకున్నాడు. తనెంటే ఏందో తెలియజెప్పాననే విజయగర్వంతో డీఎస్ ఉండిపోయాడు.
రాజ్యసభకు రాజీనామా చేయలేడు… ఏ పార్టీలోకి పోవాలో ఇతమిత్థంగా తేల్చుకోలేడు… అందుకే అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉండిపోయాడు. పెద్ద కొడుకు, మాజీ మేయర్ సంజయ్‌పై లైంగిక ఆరోపణలతో జైలుకు పంపిన ఘటనలో టీఆరెస్ పాత్ర బలంగా ఉందని డీఎస్ నమ్మాడు. ఇది కూడా ఆయనలో మరింత పగ, విద్వేషాన్ని రగిల్చింది. సమయం కోసం చూస్తున్నాడు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్‌లో కొత్త ఊపు కనిపించింది. అప్పటి వరకు డీఎస్‌కు కాంగ్రెస్‌తో సత్సంబంధాలే ఉన్నాయి. బీజేపీలో చేరుతాడని ప్రచారం చేసినా.. ఆయన మనసు సోనియా దగ్గరే తచ్చాడుతున్నది. పెద్ద కొడుకును రేపు కాంగ్రెస్‌లో ఓ స్థాయిలోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నాడు. తను అనుకుంటే ఢిల్లీ లెవల్లో చక్రం తిప్పి పెద్ద కడుకును సెట్ చేయగలడు. సంజయ్ కూడా నేడో, రేపో కాంగ్రెస్‌లో చేరబోతున్నాడు. ఇప్పటికే రేవంత్‌ను కలిశాడు. మరి కాంగ్రెస్‌లోకి మళ్లీ పోవడం ఎప్పుడు…?
వచ్చే ఏడాది జూన్ వరకు రాజ్యసభ పదవీ కాలం ఉంది. దీనికి ఆరు నెలల ముందే రాజీనామా చేసి తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించాలని డీఎస్ యోచిస్తున్నాడు. అంటే వచ్చే ఏడాది జనవరిలో డీఎస్ అజ్ఞాతం వీడనున్నాడన్నమాట. అప్పుడు తన రాజకీయ వేదిక, భవిష్యత్తు గురించి ప్రకటించబోతున్నాడు. ఇప్పటికే ఇందూరు రాజకీయాలు వాడివేడిగా మారాయి. ఓవైపు అర్వింద్ దూసుకుపోతున్నాడు. మరోవైపు త్వరలో కవిత మంత్రిగా జిల్లాపై పూర్తి పట్టు సాధించి.. టీఆరెస్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు రంగం రెడీ అవుతున్నది. ఇప్పుడు డీఎస్ కూడా జిల్లా కేంద్రంగా తన రాజకీయ బలం చూపేందుకు రెడీ అవుతున్నాడు. ఎవరిది పై చేయిగా నిలుస్తుందో? ఈ రాజకీయాలు ఎటు మలుపులు తిరుగుతాయో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇక్కడి రాజకీయాలంతే. ఎప్పుడూ వార్తలకు కేంద్ర బిందువవుతాయి. త్వరలో అదే జరగబోతున్నది.
ఈ రోజు డీఎస్ పుట్టినరోజు. ఎక్కడా ఆడంబరాలు లేవు. ఆర్బాటాలు లేవు. ఒకప్పటి వేడుకలు, సంబురాలు ఇప్పుడు లేవు. జన్మదిన శుభాకాంక్షలు.