జగన్ తనను పక్కన పెట్టేశాడంట. అప్పటి వరకు ఎన్నికల్లో షర్మిలను ఉపయోగించుకుని.. అధికారంలోకి రాగానే పక్కన పెట్టేశారనేది అందరూ అనుకున్న ముచ్చటే. అదే విషయాన్ని ఆమె ఇలా ఈ వేదికగా పంచుకున్నది. ఆమె పార్టీ పెట్టడానికి చెప్పిన కారణమే.. ఆమె రాజకీయ పరిపక్వతను సూచిస్తున్నది. ఇక్కడ రాజకీయ శూన్యత ఉందని, అందుకే ఇక్కడ పార్టీ పెట్టానని ఏదేదో చెప్పింది. ఆంధ్రలో అన్నా.. తెలంగాణలో చెల్లి. బాగుంది. కానీ అక్కడ పాదయాత్రలు చేసి నాలుగు రాసిచ్చిన మాటలు వల్లెవేసి .. అదే అధికారంలోకి తెచ్చిందని మిడిసిపడుతున్న షర్మిలకు.. తెలంగాణలోని రాజకీయాలకు అంత చీప్‌గా కనిపించి ఉంటాయి. ఇదో లెక్కనా అని ఆమె అనుకుని ఉంటుంది. కనీస అవగాహన లేదు. చరిత్రపై పట్టులేదు. ఇక్కడి ప్రజల పై ప్రాంతంపై ప్రేమ లేదు. ఒక్కటే ఉంది. ఇక్కడ ఎలాగైన అధికారం కోసం తండ్లాడాలె. అంతే అది తప్ప మరేదీ లేదు. అదంతా ఈజీనా. ఇక్కడి ప్రజలకు షర్మిల రాగానే ఆమాంతం భుజానికెత్తుకుని ఊరేగుతారని భావించిందా? తన మూలాలు మరిచిందా? ఏపీని అన్నకు వదిలేసింది. ఇక్కడ తన సత్తా ఏంటో కేసీఆర్‌కు, జగన్‌కు చూపేందుకు రెడీ అయ్యిందన్నమాట. అన్న మీద కోపం తెలంగాణ మీద తీయాలనుకుంటుందా? అక్కడ కుటుంబ కలహాలు తెలంగాణ రాజకీయంలో ఓ కొత్త పార్టీకి పురుడు పోశాయన్నమాట. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆమె ఎంచుకున్న విధానం, మాట్లాడే తీరు.. అంతా చర్చలో భాగమవుతున్నది. నవ్వుల పాలవుతున్నది.
ఈ పార్టీ ఎన్ని రోజులుంటదో..? ఎలా తట్టుకుని నిలబడి ఉంటుందో చూడాలి.
