ఒక గుక్కతాగి రాజారెడ్డి ముఖం చిట్లించాడు. ఘాటుగా ఉన్నట్టుందని గ్రహించిన శ్రీధర్ గ్లాస్ లో ఇంకొన్ని నీళ్లు కలిపాడు.
గొంతులో నుంచి వేడివేడిగా కాలుతున్నట్లు లోపలికి దిగింది ఐబీ మందు. పేగులు కరకర మన్నాయి. ” చెప్పు రెడ్డి ఏందీ సంగతి? ఈ మధ్య టెన్షన్ టెక్స్ట్ గా ఉంటున్నావు” అన్నాడు. ” కరోనా వేళ పెట్టిన టార్గెట్లు చేయలేకపోతున్న శ్రీధర్” మెల్లగా తన ఆవేదన బయటపెట్టాడు.
శ్రీధర్ ఇదేమీ వినిపించుకోలేదు. చుట్టూ చూస్తున్నాడు. చట్టు ప్లాట్లుగా చేసి ఎక్కడికక్కడ కడీలు పాతారు. పచ్చగా గడ్డి మొలిచింది. అక్కడక్కడా తాటి చెట్లు కనిపిస్తున్నాయి. వాటినిచూసిన శ్రీధర్.. ” కరోనా దెబ్బకు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది రెడ్డి! చూడు ఎక్కడిపాట్లక్కడ బోసి పోయి కనిపిస్తున్నాయి. లేకపోతే ఈ ప్రాంతమంతా దళారులతో సందడి సందడిగా కనిపించేది” అన్నాడు.
తను కూడా చుట్టూ పరికించి చూస్తున్నాడు. .
” అగో ఆ మర్రి చెట్టు కింద కూర్చుని మందు కొడుతున్నారు చూడు… వాళ్లంతా ఈ ఏరియా రియల్ బ్రోకర్లే. రోజు రావాలి… తాగి చెట్ల కింద పడుకొని సాయత్రం పోవాలి… ” అన్నాడు నవ్వుతూ….
” మన బతుకుల గురించి చెప్పమంటే వాళ్ల గురించి చెప్పవడివి ” అన్నాడు రాజారెడ్డి కొంచెం అసహనంగా.
“ఏందీ నీ బాధ..? ఆ టార్గెట్ల గురించి అంటున్నవా? అవి కావు రెడ్డి. ఎవడిస్తాడు ఈ టైమ్ లో. చాలా కష్టం.” అన్నాడు.
“ అందుకే నేను కూడా నీలాగా ఓ సొంత పత్రిక పెట్టుకుంటే ఈ మెంటల్ టెన్షన్ ఉండదు కదా” అన్నాడు. తల పైకెత్తి రాజారెడ్డిని ఓసారి తెరిపారాచూసి… నవ్వుకున్నాడు. “ఇపుడు ఈ సొంత పత్రిక నీకవసరమా ?” అన్నాడు.
“పేరు గొప్ప ఊరు దిబ్బ… అన్నట్లుంటది మా బతుకు. మేమే దానికి ఎడిటర్. పడితే శికారి, లేకపోతే బికారి.”
” చెప్పొద్దుగానీ రెడీ! ఇదో బిచ్చపు బతుకు” అన్నాడు ఒక్కసారిగా. కొద్ది సేపు ఏమి మాట్లాడకుండా చుట్టూ చూశాడు.
” ఒకడి దగ్గరకు యాడ్ ఇవ్వమని ఎన్నిసార్లు వెళ్లి అడుగుతాం… మనమొక్కళమే ఉన్నమా …. మిగిలిన వారు ఎంత మంది వాడిని పీడించుకు తింటారు.”
“అంత ఆషామాషీ కాదు రెడ్డి… ఈ ఆలోచన మానుకో….” “ వరంగల్ నుంచి ఇక్కడికి బతకడానికి వచ్చిన శ్రీకాంత్ గాడి పరిస్థితి నీకు తెలుసు కదా? ” అన్నాడు. “శ్రీకాంత్ తెలుసు … ఏమైంది అన్నాడు రాజారెడ్డి.
” ఇట్లనే గొప్పలకు పోయి ‘జనంనాడి’ అని ఓ పత్రిక పెట్టుకున్నాడు. దాన్నడ్డం పెట్టుకుంటే ఎవడైనా ఇంటడని, అడిగింది ఇస్తడని, చెప్పింది చేస్తడని వాడనుకున్నాడు.” అన్నాడు.
రాజారెడ్డి వింటున్నాడు. “ చివరకు అప్పులపాలై …. సంసారం విచ్చిన్నమై…. – భార్య ఆత్మహత్య చేసుకున్నది” చెప్పి తలదించుకొని కొద్ది సేపు ఆగాడు.
ఖాళీ అయిన గ్లాసుల్లో మరో రెండు పెగ్గులు రెడీ చేశాడు. ఒక్క పెగ్గుకే రాజారెడ్డికి తల గిర్రుమంటున్నది. లోపల కడుపులో లిక్కర్ కమ్మగా కుదురుకుంటున్నది. మత్తులో శరీరం కొత్త ఊపునిస్తున్నది.
” ఆడు ఇక్కడికొచ్చి పెండ్లాన్ని పోగొట్టుకొని, పిల్లలను అనాథలుగా చేసుకొని మళ్లీ వరంగల్ కు వెళ్లిపోయాడు రెడ్డి…..”
“ వాడి జీవితమే నీకు నాకు గుణపాఠం కావాలె ” అన్నాడు శ్రీధర్ ఆవేదనగా. “మరైతే ఎట్ల? “అన్నాడు… రాజారెడ్డి మనసంతా గందరగోళంగా ఉంది.
“ఏదైనా వేరే రూట్ వెతుక్కోవాలె రెడ్డి…? కూలీ పని చేసుకునేటోడైనా రోజుకు రెండుమూడొందలు సంపాదిస్తున్నాడు…. మనం అంతకన్నా అధ్వానం…” అన్నాడు.
“ ఈ సమయంలో కూలీ పని కూడా దొరకడం లేదనుకో..”అన్నాడు కరోనా పరిస్థితులు తలుచుకొని.
” ఇందులో ఉంటే డబుల్ బెడ్ రూం, ఇంకా ఏవేవో సంక్షేమ పథకాలు వస్తాయి కదా? అన్నాడు. ” శ్రీధర్ ను కన్విన్స్ చేసే విధంగా.
పిచ్చోడిని చూసినట్లు చూశాడు రాజారెడ్డిని శ్రీధర్. ” ఏంటీ డబుల్ బెడ్ రూమా? ప్రెస్ క్లబ్ దగ్గర గుడి వద్ద బిచ్చగాళ్లు కూర్చున్నట్టు పొద్దున్నే వచ్చి వాలే బ్యాచ్ లో నువ్వు కూడా మెంబర్ వేనా?” అన్నాడు శ్రీధర్ వ్యంగ్యాంగా.
రాజారెడ్డికి అర్థం కాలే. రెండో పెగ్గు లేపి సగం తాగేశాడు కసిగా.
” ఎవడో ఏదో ఇస్తాడని, ఇంకేదో బావుకుందామని ఆశల పల్లకీలో ఊరేగుతూ… పెండ్లాం పిల్లలను పట్టించుకోకుండా ఇదే లోకమని బతికే నీలాంటి వారిని చూస్తే నాకు జాలేస్తుంది రెడ్డి.”
“ నాదీ అదే పరిస్థితి అనుకో..” అన్నాడు… తనేమీ అందుకు అతీతుడని కాదని చెప్పేందుకు. రెండో పెగ్గు పూర్తి చేశాడు శ్రీధర్. మాటలు మత్తుగా వస్తున్నాయి. పల్లీలు నములుతూ…. ” నీ జేబులో ఉందే అక్రిడేషన్ కార్డు. అది మన నాలిక గీసుకోవడానికి కూడా పనిచేయదు ” అన్నాడు కచ్చగా. రాజారెడ్డి ఇగో దెబ్బతిన్నది.
” ప్రెస్ అంటే సమాజంలో గౌరవం ఉంటుంది కదా శ్రీధర్…” ఇంకా ఏదో అనబోయాడు రాజారెడ్డి, తోక తొక్కిన తాచులా కస్సున లేచాడు శ్రీధర్… ” ఏందీ గౌరవం, పరపతి…
ఇంకా ఈ ఫాల్స్ ప్రెస్టేజీలో పడి కొట్టుకుపోతున్నావా? అయితే నిన్నెవడూ కాపాడలేడు.” ” సంకనాకిపోతావు పో…” అన్నాడు. మత్తు నశాలానికి అంటడంతో మాటలు కూడా రఫ్ గా వస్తున్నాయి. –
కొద్ది సేపు అలాగే పచ్చటి గడ్డిపై పడుకున్నాడు. ఆకాశానికేసి చూస్తు ఏదో ఆలోచిస్తున్నాడు శ్రీధర్. వెంటనే ఏదో గుర్తుకొచ్చినవాడిలా దిగ్గున లేచి ఫోన్ తీశాడు. నెట్ ఆన్ చేశాడు.
టప టపా వాట్సాప్ మెసేజ్ లు వచ్చి పడుతున్నాయి. జర్నలిస్టు గ్రూపు ఓపెన్ చేశాడు.
ఓ వార్త దగ్గర అతని చూపులు ఆగిపోయాయి. అది చూసి షాక్ తిన్నాడు. శ్రీధర్ ముఖం వివర్ణమయ్యింది. అది గమనించాడు రాజారెడ్డి.
“ఏ మైంది శ్రీధర్ ?” అన్నాడు ఫోన్ చూపించాడు శ్రీధర్… “అప్పుల బాధతో జర్నలిస్ట్ ఆత్మహత్య”
“ఇప్పటి దాకా జర్నలిస్టులను కరోనా డైరెక్ట్ గా దాడి చేసి కడ తేర్చింది. ఇపుడు పరోక్షంగా కడతేర్చడం మొదలు పెట్టంది” అన్నాడు శ్రీధర్.
రాజారెడ్డి మనసు అప్పటికే మొద్దుబారిపోయి ఉంది. విలేకరి ఆత్మహత్య వార్త విన్న తర్వాత అతని మనసు మనసులో లేదు.
శూన్యంలోకి చూస్తూండిపోయాడు.
” ఇది నేను ముందే ఊహించాను రెడ్డీ. మనల్నే కాదు .. ఈ ఆర్థిక ఇబ్బందులు ఎంత మంది జీవితాలను ఇక కడతేర్చనున్నాయో? ” అన్నాడు విషాదం నిండిన వదనంతో. .
” ఓ వైపు కరోనా తో పోరాటం చెయ్యాలె. బతుకు పోరును కొనసాగించాలె. ఆ తర్వాత ఇది సృష్టించిన కరువు తాకిడికి తట్టుకోవాలె. గుండెధైర్యమున్నోడు పోరాడుతాడు. అది లేనోడు కడతేరుతాడు.” అన్నాడు భవిష్యత్తును ఊహించుకుంటూ.
” ఇప్పటికే ఎంతో మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి చనిపోయారు. ఎన్నో కుటుంబాలు ఆగమయ్యాయి. రోడ్డున పడ్డాయి. మరెంతో మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. బతుకులు భారమై దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇపుడు మరింత ప్రమాదం పొంచి ఉంది.”
“మొన్నటి దాకా వైరస్ జయించలేక పిట్టల్లా రాలుపోతూవచ్చాం. ఇపుడు జీతాలు లేని జీవితాలను నెట్టుకురావడం కరోనా కన్నా ప్రమాదంగా మారింది. దీని ప్రభావమే ఇదంతా” చెప్తూ పోతున్నాడు శ్రీధర్.
ఈ వార్త విన్న తర్వాత ఇద్దరికీ మందు తాగాలనపించలేదు. ఇద్దరు తమ భవిష్యత్తును తలచుకుని భీతిల్లుతున్నారు. అది వారి ముఖాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.
కొద్ది సేపక్కడ నిశ్శబ్దమే రాజ్యమేలింది.
చుట్టూ ఉన్న కొండలను, గుట్టలను చూస్తూ ఎవరికి వారే ఏదోదో ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనల్లో నిలకడ లేదు. నిండా భయమే కనిపిస్తున్నది.
( ఇంకా ఉంది)
