ఎంత చదువుకుంటే ఏం లాభం. కడుపు నింపేందుకు అది పనికిరానప్పుడు. ఇప్పుడు కావాల్సింది క్వాలిఫికేషన్ కాదు.. కాలే కడుపుకు పట్టెడన్నం. మన బతుకులు ఎలా ఉండాలో తేల్చది డిగ్రీ సర్టిఫికేట్లు కాదు.. ఆ రోజు గాసానికి కావాల్సిన పైకం. అందుకే చదువుతో నిమిత్తం లేకుండా విద్యావంతులు వీధి వ్యాపారాలను ఎంచుకుంటున్నారు. ఇందులో సిగ్గుపడాల్సిన విషయమేముంది? అన్ని రంగాలు ఉద్యోగులను నడిబజార్లో పడేశాయి. ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.
ఏమీ చేయలేని నిస్సహాయత. ఎవరినీ చేయి చాపి అడిగాలన్న అడ్డొచ్చే ఆత్మగౌరవం. ఒకవేళ సిగ్గువిడిచి అడిగినా.. పైసా అప్పు పుట్టని దుస్థితి. అందుకే అది పండ్ల వ్యాపారమా… గప్‌చుప్‌ల బండా… కూరగాయల బండా.. కిరాణా దుకాణమా.. చికెన్ సెంటరా.. పాల బూతా..? ఏదైతే ఏముంది? పొట్టనిండాలె. పూట గడవాలె. ఇంట్ల ఖర్చులెల్లాలె. చావకుండా బతకాలె. ఎవరో వస్తారని ఏదో చేస్తారనే ఎదురుచూపులకు ఇక కాలం చెల్లింది. కరోనా బతుకు పాఠం నేర్పింది. గుణపాఠాలు చెప్పింది. బతకడమెలాగో చెప్పింది. సర్కార్‌పై ఆధారపడితే పుట్టగతులుండవని సోదాహరణగా కళ్లకు కట్టింది.
సర్కారు కొలువుల కోసం చూడటమంటే… నీ చావు కొనితెచ్చుకున్నట్టే.. నీ ఉనికిని కోల్పోయినట్టేనని తన్నిమరీ చెప్పింది. అందుకే ఇప్పుడు నిరుద్యోగులు తేరుకుంటున్నారు. తెలివి తెచ్చుకుంటున్నారు. జీవితం తలకిందులు కాకముందే.. బతుకు బజారుపాలు కాకముందే.. తెలివిడి ప్రదర్శించి .. ఏదో ఒకటి చేసుకుని పొట్ట పోసుకుంటున్నారు. ఎవరినో ఆడిపోసుకునే బదులు రెక్కలు కష్టాన్ని నమ్ముకున్నది మేలని గుర్తెరిగి నడుచుకుంటున్నారు.
