అదో మాఫియా. బస్టాండ్లలో ఎప్పుడూ వారికే వ్యాపారాలు. టెండర్లు మారుతున్నా… వ్యాపారులు అక్కడ మారరు. స్టాల్స్ నెంబర్లు మారుతాయంతే. వాటికి అంత డిమాండ్. బస్టాండ్లలో వ్యాపారాలు చేయడమంటే బంగారు గుడ్లు పెట్టే బాతులాంటివన్న మాట. అంత లాభాలెలా వస్తాయంటారా? ఇక్కడంతా రేట్లు ఎవరికి వారు పెట్టుకున్నవే. ఎమ్మార్పీ గిమ్మార్పీ జన్తా నై. ఎవడికి నచ్చింది వాడు అమ్మేస్తాడు. నాణ్యత దేవుడెరుగు. అన్నీ ఆర్డినరీ సరుకులు. ఎక్కువ గిట్టుబాటు వచ్చే నాసిరకం తినుబండారాలిక్కడ దర్శనమిస్తాయి. బస్టాండ్లలో పల్లె ప్రజలే వీరికి ప్రధాన టార్గెట్. వారిలోని అమాయకత్వం వీరికి పెట్టుబడి. రేట్లు ఎక్కువగా అడిగినా.. ఏమీ అనరు. ఫిర్యాదు చేయరు. అడిగింది ఇస్తరు.. తీసుకుని పోతరు. ఇలా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఇక్కడి వ్యాపార మాఫియా కొనసాగుతున్నది.
గతంలో చాలా మంది దీనిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ప్రకటించారు. కానీ అవన్నీ ప్రకటనలకే. ఎందుకంటే ఈ మాఫియాలో ఆర్టీసి అధికారులకూ వాటాలుంటాయి. మరి వచ్చే వాటాలను ఎవరొద్దంటారు. నెలవారీ మామూళ్లలాగా ఇవి అధికారుల జేబులు నింపుతాయి. అందుకే ఇదిలా కొనసాగుతున్నది. ఇప్పుడు ఈ మాఫియాపై సజ్జనార్ తనదైన మార్కు ఎన్‌కౌంటర్ ఎక్కుపెట్టాడు. ఎమ్మార్పీ బోర్డులు తగిలించాడు. ఎక్కువ రేట్లకు అమ్మితే మేనేజర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించాడు. కానీ అంత తొందరగా వీరు వినరు. అది అమలు కాదు. దీనిపై గట్టి కసరత్తే చేయాలి. మూలాల్లోకి అవినీతి పేరుకుపోయింది. ఏ ఒక్కరోజులోనో ఇది సమూలంగా దూరంగా కాదు. కఠినంగా ఉండాలి. తీగలాగితే డొంక కదులుతుందన్న చందంగా.. ఇక్కడ వ్యాపార మాఫియా మీద దెబ్బకొడితే.. ఆఫీసులో కూర్చుని వాటాలు తీసుకునే అధికారుల లాగులు తడవాలి. వేటు పడాలి. అప్పుడే ఈ మాఫియా తోకముడిచేది. మరి మన సజ్జనార్ ఈ ఎన్కౌంటర్‌లో సక్సెస్ అవుతాడో… మంత్రి, సర్కార్ దాకా పోవడంతో తోక ముడుస్తాడో తెలియదు. చూడాలి.