ఈరోజు చాలా మహోన్నతమైనది
కరోనా కకావికలంలో
ఆపన్న హస్తం కోసం
కండ్లు కాయలు కాచేలా
వాచిపోయిచూసిన
ప్రైవేటు గురువులకు
ఈ రోజు నిజంగా
మహత్తరమైన రోజు
రెండేళ్ల నుంచి జీతాలు
ఇవ్వని కార్పోరేట్ యాజమాన్యాల
కబంధ హస్తాల మద్య
నలిగిన బక్కపానాలకు
కానీ కూడా విదిల్చలేదు
కానీ ఫీజులు మాత్రం
కాణీ లేకుండా ముక్కలు పిండి
వసూలు చేసిన సిగ్గులేనితనం
టిక్కటక్కున చలాకీ గా
ఇస్కూల్ కొచ్చే పంతుల్లు
కాసులు లేక కటకటలాడి
కులవృత్తి లో కొందరు
వ్యవసాయ కూలీలుగా ఇంకొందరు
పూలమ్మిన చోట కట్టెలమ్మటమా
అనే అహం లేకుండా టిఫిన్ సెంటర్ లో
చెప్పులు షాపుల్లో కిరాణా కొట్లల్లో
మెడికల్ దుకాణంలో ఆఖరికీ
ఫుట్ పాత్ మీద పండ్లో పూలో
అమ్మి పొట్టపోసుకుంటున్న
నా గురువులకు శుభాకాంక్షలు
ఉన్న ఊళ్లో ఏపని చేసినా
నలుపొస్తుందని నామోషీ తో
పట్నం లో ఆబిడ్స్ బొగ్గులకుంటలో
ఫినాయిల్ కలర్ గుండ్లు తెచ్చి
పురాణా ఫూల్ లో అత్తర్లు తెచ్చి
బేగం బజారులో చిక్కీలు తెచ్చి
గడప గడపకు తిరుగుతూ కాన్వాస్
బాగుల్లో మోస్తూ కన్నీరు కారకుండా
మొహాన నవ్వు పులుముకుని
బతుకు భారంగా ఈడుస్తున్నా
కార్పొరేట్ సంస్థల పై కనీస చర్యలు
తీసుకోని ఈ వ్యవస్థ సాక్షి గా
ఈ రోజు చాలా అద్భుతమైన దినం
ప్రైవేటు పంతుల్ల తద్దినం
ఒక్కటే తక్కువ వారి స్తితికీ
గతికీ కారణ భూతులందరికీ
టీచర్స్ డే శుభాకాంక్షలు
#శ్రీనివాస్_సత్తూరు
