రెండేళ్ల కింద మాట. కరోనా వైరస్ మాదిరిగా అప్పట్లో డెంగ్యూ వైరస్ విజృంభించింది. అదో పాండమిక్ వాతావరణం. ప్రాణాలు గాల్లో కలిశాయి. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి పేద జనం ఆర్థికంగా చితికిపోయారు. వందలు, వేలల్లో జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. నష్టం జరిగిన ఆ తరువాత ప్రభుత్వం మేలుకొన్నది. దిద్దుబాటు చర్యలకు దిగింది.
దోమల నివారణ పై ప్రత్యేక దృష్టి సారించడంతో కేసులు తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు కరోనా విజృంభన నేపథ్యంలో ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెరిగింది. ఈ కారణాల వల్ల ఈ రెండు సంవత్సరాల్లో డెంగ్యూ కేసులు తక్కువగా నమోదయ్యాయి. కానీ ఆ దోమ ఇంకా బతికే ఉంది. ఏడీస్ ఈజిప్టీ (టైగర్ దోమ) జాతికి చెందిన ఈ దోమలు డెంగ్యూ వైరస్ను కలిగి ఉన్నాయి.
అవి 2019లో ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా గణనీయంగా తగ్గుముఖం పట్టినా.. ఇంకా బతికే ఉన్నాయి. క్రమంగా తమ వంశాన్ని వృద్ధి చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు మెల్లగా పంజా విసురుతున్నాయి. క్రమంగా వారం రోజుల నుంచి పల్లెల్లో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన ఏడాదితో పోలిస్తే ఇప్పటి వరకు నమోదైన కేసులు అధికం. ఇవి ఇంకా మున్ముందు పెరిగే అవకాశం ఉంది.
