‘కుక్క కాటుకు చెప్పుదెబ్బ’ అంటారు. కానీ ఇక్కడ ఓ కర్కశ కుమారుడి తీరుపై ఓ ఆర్మీజవాన్ చెంపదెబ్బ తో సమాధానిమచ్చాడు. వరుసగా మూడు చెంపదెబ్బలు కొట్టి బుద్ది వచ్చేలా చేశాడు. జవాన్ దెబ్బలకు ఆ కొడుకు దిమ్మ దిరిగింది. తత్వం బోధపడ్డది. బుద్ది తెచ్చుకుని చెంపలేసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతనెలలో జరిగిన వీడియో ఉన్నట్టుంది. ఇప్పుడిది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
కన్న కొడుకు.. తన భార్య చేత తల్లిని ఇంట్లోకి రానీయడం లేదు. ఆమె బతిమాలుతున్నది. కోడలు ససేమిరా అంటూ బయటకు నెట్టేస్తున్నది. పక్కనే ఓ వారగా కూర్చుని ఇదంతా తాపీగా చూస్తున్నాడు ఆ కొడుకు. ఆ పక్కనుంచి వెళ్తున్న ఆర్మీ జవాన్ ఇదంతా చూశాడు. కోడలిని మందలించాడు. ఆమె వినలేదు. జవాన్‌తోనూ గొడవ పడుతున్నది. పెద్ద పోటుగాడిలా… తను చేసేది ఘనకార్యంలా దీనిపై మట్లాడేందుకు అక్కడికి వచ్చాడా కొడుకు. ‘నీకెందుకోయ్.. నీదారిన నీవెళ్లు..’ అనే రీతిలో జవాన్‌తో వాదులాటకు దిగాడు. అప్పటి వరకు ఓపిక పట్టిన ఆ జవాన్ .. ఆ కర్కశ కొడుకు చెంప చెళ్లుమనిపించాడు. ఒక్కసారి కాదు వరుసగా మూడ సార్లు.. దీంతో కోడలు ‘పరిస్థితి బాగాలేదు.. నాకు కూడా పడతాయేమో చెంపదెబ్బలు’ అనుకున్నట్లున్నది. అక్కడి నుంచి జారుకున్నది. కొడుకు కు అక్కడ సీన్ అర్థమయ్యింది. అమ్మను తీసుకున్నాడు. లోపలికి తీసుకెళ్లాడు. అప్పటి వరకు ఫైర్ అయిన జవాన్‌కూడా శాంతించాడు. మరోమారు కొడుకును సముదాయించాడు. అమ్మను బాగా చూసుకో అని బుద్ది చెప్పాడు. లోపలికి తీసుకెళ్లేంత వరకు అక్కడే ఆగి చూసి మరీ సంతోషంతో వెనుదిరిగాడు.