ఈటల రాజేందర్ దగ్గరికి పొద్దున్నే ఓ విలేకరి వచ్చాడు.
అది ‘దమ్మున్న వార్తల’ పేపర్. అందులో అతను పెద్ద విలేకరి.
‘సార్ మన పేపర్‌లో మీ గురించి బాగానే రాస్తున్నం సర్’ అన్నాడు.
‘ఆ చూస్తున్న బాగనే వస్తున్నాయి. ఉన్నదున్నట్టు రాస్తున్నరు’ అన్నాడు ఈటల
ఆ విలేకరి ముఖం సంతోషంతో విప్పారింది.
మళ్లీ అన్నాడు ఈటల… ‘ఈ రోజుల్లో ఉన్నదున్నట్టు రాయాలంటే కూడా దమ్ముండాలె బై’
అందుకే మేము ”దమ్మున్నవార్తలు’ గానే ప్రజల్లోకి వదులుతున్నాం కదా సార్’ అన్నాడు కొద్దిగా ఛాతీ ఉబ్బించి.
‘అన్నింటినీ అవలీలగా కొనేయగల టీఆరెస్.. మీడియా ను కొనడం ఓ లెక్క కాదు.. అందుకే అన్నీ అటే పాటపాడుతున్నాయ్…’
‘అవును సార్..’
‘ఏ ఒక్కరికైనా కేసీఆర్ ను కాదని, అతనికి వ్యతిరేకంగా రాసే దమ్ముందా?’
‘లేదు సార్..’
‘అసలిక్కడ ఇంత ఫోకస్ పెట్టి.. ఇంత హంగామా చేయాల్సిన అవసరం కేసీఆర్‌కు ఉందా? ఇంతలా భయపడుతున్నాడంటే ఓటమి ఖాయమని తెలిసిపోయినట్టే కదా..!’
‘లేదు సార్..అవున్సార్….’ విలేకరి తడబడుతున్నాడు.
ఈటల ప్రశ్నల పరంపరంకు బ్రేక్ వేయాలనుకున్నాడు. మెల్లగా తను వచ్చిన పని చెప్పాడు.
‘సార్ మా పత్రికకు యాడ్ ప్యాకేజీ కావాలి.’
ఇది ముందే ఊహించినట్టున్నాడు ఈటల . ‘ఎంత?’
డైరెక్టుగా మ్యాటర్‌లోకి వచ్చాడు.
చెప్పాడా విలేకరి.
‘అంతనా? ఏందిబై ఇది. నాతో కాదు’ అన్నాడు
ఈటల అలా అనేసరికి విలేకరి ముఖం చిన్నబోయింది.
కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. ‘చూశారు కదా సార్ మేము ఇంత నిర్బంధం, ఒత్తిడిలో కూడా మీ గురించి బాగా రాస్తున్నాం. టీఆరెస్‌ను చీల్చి చెండాడుతున్నాం.’
‘నిజమే. కావొచ్చు. కానీ, నాతో అంత డబ్బు ఇచ్చుడు కాదు బై.’
‘ఇవ్వకపోతే కష్టం సార్.’ కొంచెం బెదిరింపు దోరణి కనిపించింది విలేకరి మాటలో.
గ్రహించినట్టున్నాడు ఈటల. ‘సారీ’ అన్నాడు.
ఇంకా ఇగో దెబ్బతిన్నట్టుంది మన విలేకరిసాబ్‌ది.
‘ఆ తర్వాత మీ ఇష్టం’ అన్నాడు చివరి ప్రయత్నంగా. ‘ఇయ్యకపోతే అంతే సంగతులు’ అనే అర్థం వచ్చేలా.
అదీ పసిగట్టాడు ఈటల. ‘మీ ఇష్టం బై ఏమన్నా రాసుకోండ్రి.’ లేచాడు.
అవమానంగా ఫీలయ్యాడు మన విలేకరి. పైకి సమాచారం పంపాడు. జరిగింది పూసగుచ్చినట్టు చెప్పాడు.
‘అంత బలుపా? అయితే మన తడాఖా చూపిద్దాం’ అన్నాడు పైన బాస్ రంకెలేస్తూ..