హుజురాబాద్ ఉప ఎన్నిక పై తండ్రి కేసీఆర్ తరహలోనే కేటీఆర్ కూడా స్పందించాడు. పార్టీ రాష్ట్ర కమిటీ మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నిక అంశం పై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. ఓ వైపు కేసీఆర్ పాలన మొత్తం హుజురాబాద్ కేంద్రంగా నడిపిస్తున్నాడు. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాత పథకాలు పరుగులు పెడుతున్నాయి. కొంగొత్త పథకాలు రెక్కలు తొడుక్కుంటున్నాయి. పదవులన్నీ హుజురాబాద్‌కే వరిస్తున్నాయి.
మూలకుపడ్డ నేతలు, జనాలు మరిచిపోయిన నేతలు ఇప్పుడు టీఆరెస్‌కు ముఖ్య నేతలయ్యారు. కేసీఆర్ వాళ్లను కళ్లకు అద్దుకుని, కండువా కప్పి పదవులు ఇస్తామని కూడా హామీలిస్తున్నాడు. ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో మిగిలిన జనలంతా ‘ఔరా..!’ అని ముక్కుమీద వేలేసుకుంటున్నారు. పాత పింఛన్లకు దిక్కులేదు. డబుల్ బెడ్ రూంల గృహ ప్రవేశాల్లేవు. దళితులకు మూడెకరాలు రాలేదు. నిరుద్యోగ భృతి ప్రకటించిన తేదీని కూడా మరిచిపోయారు. ఎన్నో.. హామీలు పెండింగ్‌లో ఉంటే కోట్లకు కోట్ల నిధులు ఒక్క హుజురాబాద్‌లో ఎందుకు పారుతున్నాయి?
కేసీఆర్ తన హోదాను కూడా మరిచి ఓ నియోజకవర్గ స్థాయి లీడర్‌గా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు. ఇవన్నీ జనాలు ఆలోచిస్తున్నారు. వాళ్ల గమనంలో ఉన్నాయి. రోజూ చర్చకు వస్తున్నాయి. కానీ ఇవన్నీ కేటీఆర్‌కు తెలియనట్లు, ఇంతకు ముందు కేసీఆర్ ఓ నేతతో ఫోన్లో సంభాషించినట్లుగా ‘హుజురాబాద్ మాకు లెక్కలేదు. ఓ చిన్న ఉప ఎన్నిక’ అని మాట్లాడడం విడ్డూరంగా అనిపించింది. ఒకవేళ ‘హుజురాబాద్ పై ఇంత సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం లేద’ని పరోక్షంగా ఈ మీడియా వేదికగా తన తండ్రి కేసీఆర్‌కు చెప్పాలనుకున్నాడేమో? అయినా ఆయన ఎవరు చెప్పిన వినేరకం కాదు. అది కేటీఆర్‌కూ తెలుసు.
పనిలో పనిగా ‘మేము ప్రతిపక్షాలకు జవాబుదారీ కాదు.. ప్రజలకు జవాబుదారేనని’ కేటీఆర్ అన్నాడు. ప్రతిపక్షాలంటే అంత లెక్కలేనప్పుడు వాళ్లు ప్రశ్నించే తీరు పై పట్టింపు లేనప్పుడు, ఎడా పెడా వాళ్లను కొనుగోలు చేసుకోవడం ఎందుకు? అసలు ప్రతిపక్షమే ఉండొద్దు.. అంత ఏకపక్షమే కావాలనే కోరికెందుకు? ఏందో ఏమో… కేటీఆర్ మాటలు కూడా అంతా ‘అతి విశ్వాసం’, ‘అహంకారపూరితం’గా ఉంటున్నాయి. ఈ మాటలు మార్చుకునేదెప్పుడూ? వ్యూహాలను పదునెక్కించేదెప్పుడు?