కరోనా థర్డవేవ్ భయం తెలంగాణను వెంటాడుతోంది. ‘అదిగో పులి వచ్చే..’ అనే చందంగా థర్డ్‌వేవ్ క్షణక్షణం భయపెడుతున్నది. ప్రపంచంలో, దేశంలో ఎక్కడా ఏ మూల కరోనా కేసులు పుట్టుకు వచ్చినా ఇక్కడ మనం గజ్జున వణికే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఇది అన్ని రంగాల పై ప్రభావం చూపుతున్నది.
జనాలు సాధారణ స్థితికి వచ్చినప్పుటికీ థర్డ్‌వేవ్ భయమైతే పోలేదు. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో ఎక్కడా థర్డ్‌వేవ్ ఆనవాళ్లు లేవు. సెకండ్‌వేవ్‌కు సంబంధించిన పూర్తి కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే మహారాష్ట్ర, కేరళ తదితర చోట్ల కరోనా కేసులు కొత్తవి పుడుతున్నాయి. వీటిని పరివర్తనం చెందిన కేసుల కింద తీసుకుంటున్నారు. ఈ డెల్టాప్లస్ వేరియంట్ కేసులు పాతదానికన్నా సీరియస్ ప్రభావాన్నే చూపుతుందని తెలుస్తోంది.
అయితే ఒక్కోచోట ఒక్కో రకమైన ఎఫెక్ట్ ఉంటుందనే వాదన కూడా ఉంది. అక్కడి పరిసరాల పరిస్థితులు, మనుషుల జీవనస్థితి ఆధారంగా దీని ప్రభావ తీవ్రతలో హెచ్చుతగ్గులు ఉండవచ్చనే అంచనాలు వేస్తున్నారు. తెలంగాణలో డెల్టాప్లస్ ఉనికి ఇప్పటి వరకు లేకపోయినా.. ప్రభుత్వం మాత్రం దీని పట్ల చాలా ముందు జాగ్రత్త వహించాలనే ఆలోచనతోనే ఉంది. థర్డ్‌వేవ్ భయం ఇటు జనాలతో పాటు అటు ప్రభుత్వాన్ని వణికిస్తున్నది.
అందుకే స్కూల్స్ రీ ఓపెనింగ్ విషయంలో ప్రభుత్వం వెనుకముందాడుతున్నది. మరోవైపు డెల్టాప్లస్ వేరియంట్ ఈ వ్యాక్సిన్లకు, కరోనా మందులకు లొంగడం లేదనే విషయాన్ని వైద్యులు గుర్తిస్తున్నారు. దీని తీవ్రత సీరియస్‌గానే ఉంటుందనే ప్రమాద సంకేతాలతే వారికున్నవి. దీనిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వస్తున్నారు.
మరో నాలుగు నెలల పాటు జనాలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు ఇది ఎప్పుడైనా దాడి చేయవచ్చని అంచనాలు వేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలు, నివారణ చర్యలు తీసుకుంటునే రోజు వారి పనులు చేసుకోవడం మేలని సూచిస్తున్నారు.